TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరాస ప్రభుత్వం తప్పటడుగు వేస్తోందా?

Published on: Mon Jun 30, 2014 11:45AM

 

గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూములలో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చి వేసిన తెరాస ప్రభుత్వం దృష్టి ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోగల లగడపాటికి చెందిన ల్యాంకో భూములపై పడింది. వక్ఫ్ బోర్డు కు చెందిన ఆ భూములలో 108 ఎకరాలు ల్యాంకో కొనుగోలు చేసి అక్కడ పెద్ద ఎత్తున భవనాలు నిర్మించింది. ల్యాంకోతో బాటు వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపు 1508 ఎకరాల భూములను ఇంతకుముందు ఉన్న ప్రభుత్వమే అమ్మివేసింది. జలయజ్ఞం ప్రాజెక్టుల కొరకు నిధులు సమీకరించేందుకు ఈ భూములను అమ్మినట్లు సమాచారం. కానీ చట్ట ప్రకారం వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ప్రభుత్వం కూడా అమ్మడానికి వీలులేదు. అందుకే ఈ భూముల అమ్మకం వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఒక కేసు నడుస్తోంది. ప్రభుత్వం తన తప్పును సరిద్దిద్దు కొనకపోగా అవి వక్ఫ్ బోర్డుకి చెందిన భూములు కావని, కనుక వాటిని బోర్డుకు అప్పగించవలసిన అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఒకవేళ అవి వక్ఫ్ బోర్డుకు చెందిన భూములేనని తేలినట్లయితే, ప్రభుత్వమే వక్ఫ్ బోర్డుకు ఆ భూమి ధర లేదా వక్ఫ్ బోర్డు కోరుకొన్న చోట అంతే విస్తీర్ణంగల భూమిని ఇవ్వవలసి ఉంటుందని కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

 

ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలతో బాటు వాటి ఆలోచనలు మారాయి. తెలంగాణాలో కొత్తగా అధికారం చేప్పట్టిన తెరాస ప్రభుత్వం కోర్టు నుండి కేసు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. టీ-మంత్రి హరీష్ రావు మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ” ఇంతకు ముందు ఉన్న ఆంధ్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు భూములను అమ్మడం చట్ట వ్యతిరేఖమని తెలిసి ఉన్నప్పటికీ అమ్మివేసింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఆ భూములను వక్ఫ్ బోర్డుకే తిరిగి అప్పజెప్పాలని నిశ్చయించుకొంది,” అని తెలిపారు.

 

అయితే ఇది కేవలం ల్యాంకో కంపెనీ ఒక్క దానికే చెందిన సమస్య కాదు. అక్కడ భూములు కొన్న మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలూ భూమిని కొన్నాయి. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఈ భూముల వ్యవహారం లో సుప్రీం కోర్టులో కేసు వాపసు తీసుకొన్నట్లయితే, కోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం తెలంగాణా ప్రభుత్వమే వక్ఫ్ బోర్డుకు నగర శివార్లలో 1508 ఎకరాలు లేదా దాని విలువ చెల్లించవలసి ఉంటుంది. కానీ ల్యాంకో తదితర సంస్థలు ఒక్కో ఎకరానికి దాదాపు రూ. 4-5 కోట్లు చెల్లించి ఆ భూములను కొనుకోన్నాయి గనుక, వాటిని ఇప్పుడు కొత్తగా అధికారం చేప్పట్టిన తెలంగాణా ప్రభుత్వం కూడా తప్పుపట్టలేదు. తప్పుపట్టినట్లయితే ల్యాంకోతో బాటు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపైన కూడా ఇదేవిధమయిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

 

ఒకవేళ ఈ భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వాం ముందుకు సాగదలిస్తే, సదరు వ్యక్తులు సంస్థల తరపున వక్ఫ్ బోర్డుకి తనే భూమి లేదా నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చును. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం అక్కడ ఎకరం రూ8 నుండి 10 కోట్ల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెరాస ప్రభుత్వం1508 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయం నగర శివార్లలో అంతే విస్తీర్ణం గల భూమి లేదా రూ. 15,080 కోట్లు నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో బహుశః ఈ రెండు కూడా సాధ్యం కాకపోవచ్చును. అటువంటప్పుడు ఈ భూముల వ్యవహారంలో తెరాస ప్రభుత్వం కూడా చల్లబడిపోతుందా లేక ఏవిధంగా ఈ సమస్యను పరిష్కరించుకొంటుంది? అనేది చూడాలి.