లగడపాటి చిలుక జోస్యం ఫలించేనా?

 

రాష్ట్ర విభజన విభజన ప్రక్రియ ఎంత జోరుగా సాగిపోతున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం సమైక్యవాదులలో సైతం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆవిధంగా కూర్చొని ఆయన రాష్ట్ర విభజనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తన అధిష్టానానికి తోడ్పడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా, పదవి పట్టుకొని వ్రేలాడుతున్నారని స్వంత పార్టీ నేతలే అవహేళన చేస్తున్నా ఆయన చలించలేదు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని నేటికీ గట్టిగా ఆయన వాదిస్తూనే ఉన్నారు.

 

ఇక అటువంటి మరో వ్యక్తి లగడపాటి రాజగోపాల్. రాష్ట్ర విభజన జరిగినట్లయితే తను రాజకీయ సన్యాసం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేయడమే కాక, ఎట్టి పరిస్థితుల్లో విభజన జరగదని నేటికీ పూర్తి నమ్మకంతో చెపుతున్నారు. అయితే, ఇంతవరకు చకచక జరుగుతున్న విభజన ప్రక్రియను చూస్తున్నవారికి ఆయన మాటలపై నమ్మకం కలగడం లేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే మాత్రం వారిరువురి జోస్యం నిజమవబోతోందా? అనే అనుమానం కలుగుతోంది.

 

రాష్ట్ర విభజన ప్రక్రియపై తుది నివేదిక ఈయవలసిన కేంద్రమంత్రుల బృందం నేటికీ రాష్ట్రాన్నిఆంధ్ర, తెలంగాణాలుగా విభజించాలో లేక ఆంధ్ర, రాయల తెలంగాణాలుగా విభజించాలో తెలియని అయోమయంలో ఉంది. విభజన ప్రక్రియ ఒక కొలొక్కి వచ్చిందని భావిస్తున్నఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం హటాత్తుగా ‘రాయల తెలంగాణా’ ప్రతిపాదన చేయడం చూస్తే, కాంగ్రెస్ చిత్తశుద్ది మీద అనుమానం కలుగుతోంది.

 

బీజేపీ మద్దతు ఈయకపోతే తెలంగాణా బిల్లు ఆమోదింపజేయలేని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి భంగపడే బదులు, ఆచరణ సాధ్యం కాని రాయల తెలంగాణా అంశం ఎత్తుకొని ఆ సాకుతో ఎన్నికల వరకు కాలక్షేపం చేసేయాలని ప్రయత్నిస్తోందా? అని అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

 

ఇటీవల పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగకపోవచ్చని అనడం చూస్తే, కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి ఇద్దరూ కూడ ఈ పరిస్థితులను చాలా ముందుగానే కనిపెట్టినందునే అంత నమ్మకంగా చెప్పడమే కాక, నిబ్బరంగా ఉండగలుగుతున్నారు.