జగన్మోహన్ రెడ్డికి కేవీపీ గండం

 

టైటానియం కుంభకోణంలో కెవీపి రామచంద్రరావు అరెస్టు కోసం అమెరికా దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు భారత ప్రభుత్వానికి అందజేసిన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆయనకి ఆత్మ వంటివాడినని సగర్వంగా చెప్పుకొంటూ సదా తెర వెనుకే ఉంటూ చక్రం తిప్పిన కేవీపీ వల్ల అటు కాంగ్రెస్, ఇటు వైకాపా రెండూ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలే ఆయనకు కోరి మరీ రాజ్యసభ సీటు ఇచ్చినప్పటికీ, ఈ వ్యవహారం బయటపడగానే దానితో తమ పార్టీకేమీ సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకొంది. ఈ వ్యవహారంలో కేవీపీయే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు. ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు వీలయితే ఆయనను కాంగ్రెస్ ఆదుకోవచ్చునేమో కానీ కీలకమయిన ఈ ఎన్నికల సమయంలో అటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వెనకేసుకు వచ్చినట్లయితే, అది మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించి దూరంగా జరిగి ఉండవచ్చును.

 

ఇక జగన్మోహన్ రెడ్డి చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్నట్లుగా నేటికీ తన తండ్రి పేరు చెప్పుకొనే ప్రజలను ఓట్లు కోరుతున్నారు. ఆయన హయంలో ఎటువంటి అవినీతి జరగలేదని, అంతా దేవుడి పాలనేనని, తాను ముఖ్యమంత్రి అయిన తరువాత తాను కూడా సరిగ్గా అటువంటి పాలనే అందిస్తానని డంకా భజాయించి మరీ చెప్పుకొంటున్నారు. అటువంటప్పుడు కేవీపీపై వచ్చిన ఆరోపణలకు ఆయన తప్పక సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఆరోపణలతో తనకు, తన తండ్రికి ఎటువంటి సంబందమూ లేదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేవీపీ తన తండ్రి ఆత్మవంటి వారు గనుక.

 

ఒకవేళ ఇవే ఆరోపణలు ఏ సీబీఐ, ఈడీ లేదా సిఐడీ సంస్థో లేక మరో రాజకీయ పార్టీయో చేసి ఉండి ఉంటే, అవి తనను ఎన్నికలలో దెబ్బతీసేందుకే తన ప్రత్యర్ధులు చేస్తున్న మరో కుట్ర అని జగన్ ఈపాటికి చాలా గగ్గోలుచేస్తూ, చివరికి ఈ అంశం ద్వారా కూడా ప్రజల నుండి ఎంతో కొంత సానుభూతి పొందే ప్రయత్నం తప్పకుండా చేసి ఉండేవారు. కానీ ఈ ఆరోపణలు అమెరికాలో దర్యాప్తు సంస్థ చేయడంతో జగన్ సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఏ మీడియా ప్రతినిధో హటాత్తుగా ఇదే ప్రశ్నవేసినట్లయితే దానికి సమాధానం చెప్పడం కష్టమే గనుక ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిచాలా అని వైకాపా ఆలోచనలు చేస్తోంది.

 

కానీ మీడియా కంటే ముందు ఆ ప్రశ్న చంద్రబాబు వేయనే వేసారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ, ఆయన ఆత్మ ఇంకా రాష్ట్రంలో కేవీపీ రూపంలో సంచరిస్తూనే ఉందని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎందుకు ఇంతవరకు నోరు విప్పడం లేదని ఆయన నిన్న ప్రశ్నించారు.

 

అయితే దానికి జగన్ ఇంకా స్పందించవలసి ఉంది. సాధారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయినప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా చేసేదొకటే. ప్రజల దృష్టిని మళ్ళించేందుకు మరో ఆసక్తికరమయిన అంశం తలకెత్తుకోవడమో లేక ప్రత్యర్ధ పార్టీ నేతల భాగోతం ఏదో బయటపెట్టడమో చేస్తుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు ఏ ఉపాయం చేస్తారో చూడాలి.