కేవీపీని 8గంటలు ప్రశ్నించిన సీబీఐ

 

జగన్ అక్రమాస్తుల కేసులో రాజ్యసభ సభ్యడు కె.వి.పి. రామచంద్రరావును సీబీఐ శనివారం నాడు దాదాపు 8 గంటలకు పైగా ప్రశ్నించింది. ఆయన మద్యాహ్నం భోజనం సీబీఐ ఆఫీసులోనే చేశారు. పొద్దున్న 11 గంటలకు మొదలయిన సీబీఐ విచారణ రాత్రి 7.30 వరకు సాగడంతో ఆయన బాగా అలసిపోయినట్లు కనిపించారు. అయినప్పటికీ, సీబీఐ ఆఫీసు నుండి బయటకి రాగానే, మీడియాతో కొంత సేపు మాట్లాడారు. తనను కేవలం సెక్షన్ 160 క్రింద సాక్షిగా మాత్రమే పిలిచారని ఆయన తెలిపారు. తనకు తెలిసిన సమాచారం అంతా సీబీఐకు తెలియజేసానని, అవసరమయితే మళ్ళీ వచ్చి సీబీఐకి సహకరించేందుకు కూడా తానూ సిద్ధంగా ఉన్నానని ఆయన మీడియాకు తెలిపారు. కానీ, కేసు విషయంలో ఏమేమి అడిగారు, తనేమి చెప్పారో వంటి విషయాలను మాత్రం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. సీబీఐ జాయింటు డైరెక్టరు లక్ష్మి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, కేవీపీ నుండి తమకు అవసరమయిన సమాచారాన్ని సేకరించామని, అవసరమయితే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. జగన్ కేసు ముగించడానికి సుప్రీం కోర్టు నిర్దిష్టమయిన గడువు పెట్టిన విషయాన్ని మీడియా ఆయనకు గుర్తుచేసి, ఆ కేసు ఎప్పటిలోగా ముగిస్తారని అడిగినప్పుడు, ఆయన సుప్రీం కోర్టు ఏమి చెప్పిందో వెబ్ సైటులో స్పష్టంగా ఉందని, వివరాలు కావలసిన వారు సదరు వెబ్ సైటును చూసుకోవచ్చునని ఆయన అన్నారు. తనకు తెలిసి మరెవరికీ సమన్లు జారీ చేయలేదని ఆయన అన్నారు.