TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ దుస్థితిపై కెవిపి ఆవేదన

Published on: Wed Apr 4, 2012 6:52AM

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ స్నేహితుడు కెవిపి రామచంద్రరావు ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మీడియాకు ముఖం చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నట్లు అన్న అనుమానాలు రాష్ట్రప్రజలను వేధిస్తున్నాయి. తెలుగువన్.కామ్ పరిశీలనలో కెవిపి ప్రస్తుత కార్యక్రమాలపై అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కెవిపి ఇప్పటికీ కేంద్ర నాయకత్వంతో ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయనతో తరచుగా కాంటాక్టులో ఉంటున్నారు.

 

అంతేకాక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూడా ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వైఎస్ కష్టపడి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని, ఆయన మరణానంతరం పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని కెవిపి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆయన ఒకవైపు కిరణ్ కు, మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక వ్యవహారాల కారణంగా జగన్, కెవిపిల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తన తండ్రి హయాంలో జరిగిన ఆర్ధిక లావాదేవీలన్నీ కెవిపి కనుసన్నల్లోనే జరిగాయని జగన్ కు తెలుసు.

అయితే ఈ ఆర్ధిక లావాదేవీల్లో చాలా మొత్తం కెవిపి దగ్గరే చిక్కుకుని ఉందని జగన్ అనుమానం. దీనిపై జగన్ కు కెవిపికి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగినట్లు తెలిసింది. ఈ వాగ్వాదం అనంతరం కెవిపి కొంతకాలం గల్ఫ్ కు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తరువాత ఆయన తన సహజశైలిలో నిశ్శబ్ధంగా తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన టి ఆర్ ఎస్ అధినేతకు కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కిరణ్ ప్రభుత్వంపై కెవిపి కినుకుతో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బొత్స సత్యనారాయణపై కొంత సానుభూతిని చూపిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా రాష్ట్ర వ్యవహారాలపై ఎప్పటికప్పుడు కెవిపి నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెవిపి హవా ఇంకా రాష్ట్రంలో కొద్దో గొప్పో కొనసాగుతూనే ఉంది. రాజేకీయ పరిణామాలు మారితే 2014 ఎన్నికల నాటికి కెవిపి కీలకపాత్ర వహించినా ఆశ్చర్యపోనక్కరలేదు.