కుందూనదిని తవ్వేస్తున్న మంత్రిగారి బావమరిది
Published on: Tue Mar 20, 2012 2:01PM
కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మంత్రిగారి బావమరిది నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా కుందూనదిలోని ఇసుకను తవ్వేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. గత మూడేళ్ళుగా ఇలా అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నప్పటికి ఆయనకు అడ్డు చెప్పేవారెవరూ జిల్లాలో కనిపించడం లేదు. మంత్రిగారి బావమరిది పగలూ రాత్రి అనే తేడా లేకుండా ప్రోక్లెన్లతో ఇసుకను తవ్వి యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఇతరులు ఎవరైనా ఆ ప్రాంతానికి వస్తే మంత్రిగారి బావమరిదిగారి అనుచరులు వారిని చుట్టుముడతారు. యక్ష ప్రశ్నలతో వేధిస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చిన దేహశుద్ధి చేస్తారు. నంద్యాల పట్టణానికి సమీపంలో నిరాటకంగా జరుగుతున్న ఇసుక దోపిడీ గురించి కెసి కెనాల్, భూగర్భ, జలశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బావమరిది ఆడగాలు మితిమీరుతున్నా మంత్రిగారు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


