జగన్ పైశాచికత్వానికి కుప్పంలో అరాచకత్వమే నిదర్శనం.. చంద్రబాబు

posted on: Oct 28, 2022 9:49AM

ఏపీ ముఖ్యమంత్రి పైశాచికత్వానికి, ఉన్నాదానికి కుప్పంలో చేస్తున్న అరాచకత్వమే నిలువెత్తు నిదర్శనమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.  అభివృద్ధి రాజకీయాలు మాత్రమే తెలిసిన కుప్పం జనాలకు వైసీపీ అరాచక రాజకీయం కొత్త అని పేర్కొన్నారు. తెలుగుదేశం నియోజకవర్గాల ఇన్ చార్జ్ తో సమీక్షలో భాగంగా గురువారం (అక్టోబర్27) కుప్పం నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే కుప్పంలో ఆయన సృష్టిస్తున్న అరాచకత్వాన్ని ఓ కేస్ స్టడీగా తీసుకుంటే సరిపోతుందన్నారు. కుప్పం ప్రజలు తనను అభిమానంతో గెలిపిస్తున్నారనీ.. తానెన్నడూ పులివెందులలోలా జనాలను భయపెట్టి ఓట్లు వేయించుకుకోవడం లేదనీ చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒకే సింబల్ పై అన్ని సార్లూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

అదే పులివెందుల నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆ నియోజకవర్గంలో నేతలు, పార్టీలు, గుర్తులు   మారాయని అన్నారు. కుప్పంలో తెలుగుదేశం నేతలను, కార్యకర్తలను… కేసులు, దాడులు, కుల విద్వేషాలతో   దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని…దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.   ఊడిగం చేసే అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ నేతల లెక్క సరిచేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు తమను భయపెట్టలేదని…..పైగా అంతా ఇప్పుడు మరింత ఐక్యంగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు చెప్పారు.   ప్రభుత్వ పోకడలతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తెచ్చినా కుప్పంలో సిఎం సభ సక్సెస్ కాకపోవడానికి స్థానికంగా వచ్చిన వ్యతిరేకతే కారణం అని నేతలు వివరించారు. కుప్పం అభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టని సీఎం… తన సభకు మాత్రం కోట్ల రూపాయలను వెచ్చించారని నేతలు తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...