కేసీఆర్ బాటలో కేటీఆర్?
posted on Nov 30, 2024 10:13AM
.webp)
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు తండ్రి కేసీఆర్ బాటనే అనుసరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత నుంచీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటంచేశారు. ఎక్కడా బయటకు రావడంలేదు. ప్రసంగాలు చేయడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు.
కేసీఆర్ ఆబ్సెన్స్ లో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఏడాది కాలంలోనూ బీఆర్ఎస్ ను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పథంలో నడపడంలో కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారంటూ ఇంటా బయటా వస్తున్న విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా.. రాజకీయ సన్యాసమా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి పోలిటికల్ గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ కు బ్రేక్ ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారనీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నారనీ, అందుకే కుమార్తె కవితను రంగంలోకి దింపారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ వైఫల్యాల కారణంగా పార్టీ మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు చేతుల్లోకి వెళ్లిపోతుందన్న ఆందోళనతోనే కేసీఆర్ కవితను రంగంలోకి దింపారని అంటున్నారు. ఆ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయలకు ప్రకటించిన బ్రేక్ సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.