TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉమా-వంశీ మధ్య సయోధ్య అసాధ్యమా?

Published on: Wed May 9, 2012 10:06AM

కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ కార్యకర్తల్లో వల్లభనేని వంశీ పట్ల నిరసన వ్యక్తం కావడాన్ని దేవినేని ఉమ సన్నిహితులు లోలోపల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, మైలవరం శాసన సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, అర్బన్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు వల్లభనేని వంశీ మోహన్ లు ఒకే పార్టీ కార్యాలయంలో కూర్చుంటున్నప్పటికీ భార్యాభర్తలు ఒక ఇంటిలో వుండి ఇష్టంలేని కాపురం చేస్తున్న తరహాలోనే కొనసాగుతున్నారు. దుడుకు స్వభావం కలిగిన వంశీ అనేక సందర్భాలలో కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమాను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేశారు. చల్లపల్లిలో ఎన్.ట్.ఆర్. విగ్రహావిష్కరణ సందర్భంగా హరికృష్ణకు అవమానం జరిగిందనే అంశంతో పాటు మద్యం దుకాణాల లైసెన్స్ ల వ్యవహారం సందర్భంగా అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి.

 

 

ఎంతోకాలంగా జిల్లా రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశంపార్టీలో దేవినేని ఉమ తిరుగులేని పట్టుసాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన సోదరుడు, మాజీమంత్రి దేవినేని రాజశేఖర్ తో వంశీ మాటల యుద్ధానికి దిగిన సమయంలో నెహ్రూను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా దూషించడం ఉమాకు మనస్తాపం కలిగించింది. దేవినేని ఉమ, వంశీ ఇరువురూ ఒకే పార్టీ కార్యాలయంలో ఉంటూనే ఎవరి మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా తిరిగి సయోధ్య అసాధ్యమని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం వంశీ జగన్ ను పలుకరించడం, ఆలింగనం చేసుకోవడంపై గందరగోళం నెలకొనడం, దీనిపై వంశీకి తెలుగుదేశంపార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం దేవినేని వర్గానికి ఆనందంగా మారింది.