కొండా సురేఖ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకే!

 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులు, విశ్వాసపాత్రులని పేరొందిన కొండా సురేఖ ఆమె భర్త మురళి, ఆయన మరణించిన తరువాత కూడా ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పట్ల అదే వినయ విదేయతలు కనబరిచారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిరువురూ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నపుడు కూడా వారు తమ విస్వసనీయతకే ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప కేసీఆర్ వంటి తెలంగాణ నేతల మాటలకు జడిసి ఎన్నడూ కూడా జగన్ మోహన్ రెడ్డి చేయి వీడే ప్రయత్నం చేయలేదు. అంతే గాకుండా వారిరువురూ తమ పార్టీకి తెలంగాణలోబలమయిన పునాదులు వేసి, పార్టీని వరంగల్ పరిసర జిల్లాలలో వ్యాపింపజేశారు కూడా.

 

తెలంగాణలో పార్టీకి వ్యతిరేఖ గాలులు వీస్తున్న తరుణంలో షర్మిల చేప్పటిన ‘మరో ప్రస్థానం’ పాదయాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందంటే దానికి కారణం కొండ దంపతుల కృషి తప్ప జగన్ మోహన్ రెడ్డి ప్రభావంవల్ల మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకానొక సమయంలో కొండ సురేఖ దంపతులే పార్టీకి తెలంగాణలో పెద్ద దిక్కుగా నిలుస్తూ పార్టీని తెరాస నేతల దాడి నుండి కాపాడుకొన్నారు.

 

కానీ, క్రమంగా పార్టీలో వారి వ్యతిరేఖ వర్గాలు బలం పుంజుకొని పార్టీ అధిష్టానం వద్ద వారిపై పిర్యాదులు చేస్తుండటంతో, పార్టీ కొండా దంపతుల విధేయతను కూడా పరిగణలోకి తీసుకోకుండా, వారిని దూరం చేసుకోవడం ఆరంబించింది. గత ఏడాది డిశంబరు నెలలో కేంద్ర హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే నేతృత్వంలో డిల్లీలో తెలంగాణాపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరపున కొండా సురేఖను కాదని వేరొకరిని పంపడంతోనే, పార్టీలో వారి ప్రాధాన్యం తగ్గించడం మొదలయిందని చెప్పవచ్చును. నాటి నుండి కొండా దంపతులు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. వారు గత కొంత కాలంగా షర్మిల పాదయాత్రలో కానీ, పార్టీ సభలు, సమావేశాలలోగానీ కనబడలేదు.

 

ఇటీవల వరంగల్‌ జిల్లాలో పార్టీ కన్వీనర్‌ పదవుల ఎంపికలో వారిని పక్కన పెట్టి, వారి వ్యతిరేఖ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో, పార్టీలో తమ పరిస్థితి పూర్తిగా తారుమారయిందని వారికి అర్ధం అయింది. పార్టీ అధిష్టానానికి ఎంత విదేయత కనబరిచినా, ఎంత సేవచేసినా తగిన గుర్తింపు గౌరవం దక్కకపోగా, చివరికి ఈవిధంగా అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసిరావడంతో జీర్ణించుకోలేని కొండా దంపతులు, ఇటీవల తమ అనుచరులు వరంగల్ పట్టణంలో పార్టీ కార్యాలయానికి తాళం వేసి నిరసనలు తెలిపినప్పుడు వారిరువురూ మౌనం వహించడంతో, వారిని దెబ్బతీయాలని చూస్తున్నవ్యతిరేఖవర్గానికి మరో సదవకాశం కల్పించినట్లయింది. ఈ విషయన్నివారు పార్టీ అధిష్ఠానం చెవిలో వేయడం, వెంటనే వారిరువురికీ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు నోటీసులు జారీ చేయడంతో, కొండా సురేఖ దంపతుల ఉద్వాసనకు రంగం సిద్దం అయింది. వారు కూడా తమ పట్ల పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకి తీవ్ర మనస్తాపం చెంది ఇక నేడో రేపో పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం.

 

తెలంగాణ ప్రాంతంలోబలమయిన నేతయిన కొండా సురేఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న తెరాస వారిరువురినీ తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. కానీ, వారు తిరిగి తమ కాంగ్రెస్ పార్టీ గూటికే చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కూడా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికయినా తమపట్ల పార్టీ అధిష్టానం వైఖరిలో మార్పు కనబడకపోతే బహుశః వారు త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.