ఆ పదవికి ఆయన కరక్టే

 

తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎన్నికైన సంగతి తెల్సిందే. కాగా సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంపిక సరైందేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... భట్టిని ఎంపిక చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు. భట్టికి డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. సీఎల్పీ పదవికోసం కోమటిరెడ్డి ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే పదవి కావాలని ఆశపడడంలో తప్పు లేదని.. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమేనని చెప్పారు.   అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నష్టం చేసిందన్నారు. చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్టు ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఒక్కరినే బాధ్యులను చేయటం సరికాదని కోమటిరెడ్డి తెలిపారు. సీట్ల కేటాయింపులోనూ కొన్ని తప్పిదాలు జరిగాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై రాహుల్‌దే తుది నిర్ణయమని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడరని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.