కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే...

 

కాంగ్రెస్ పార్టీకి తెరాసకు, వైకాపాకు మధ్య కుదిరిన రహస్య ఒప్పందాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. అయితే రాహుల్ గాంధీ నిన్న ఎన్నికల ప్రచార సభలో ‘పెహ్లే హాత్ మిలాయే, బాద్ మే గల్లె మిలాయే...బాద్ మే పీట్ మే చూరి చలాయా” (మొదట కేసీఆర్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారని, తరువాత కౌగలించుకొన్నారని ఆనక వెన్నుపోటు పొడిచారని) చెపుతూ కేసీఆర్ తో తమకున్న రహస్య అవగాహన గురించి ఆయనే బయటపెట్టుకొన్నారని అన్నారు.

 

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వాదిస్తున్న కిరణ్ నేటికీ రాష్ట్ర విభజన జరగలేదనే తాను భావిస్తున్నట్లు తెలిపారు. జూన్ రెండున రాష్ట్రం అధికారికంగా వేరు పడేంత వరకు కూడా తాను రాష్ట్ర విభజన జరిగినట్లు అంగీకరించనని అన్నారు. అయినా సుప్రీం కోర్టులో తను వేసిన కేసు వల్ల మళ్ళీ ఏదో ఒకరోజు తప్పకుండా విభజన బిల్లుని పునసమీక్షించే పరిస్థితి వస్తుందని అన్నారు. కాం

 

గ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన నాటి నుండి దానిని వ్యతిరేఖిస్తూ తీవ్ర వాదనలు చేసినప్పటికీ కడదాక ఆయన విభజనకు తనవంతు సహకారం అందిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని చిరంజీవి, రఘువీరా రెడ్డి తదితరులు చెపుతున్నారు. వారికి బదులిస్తూ "అసలు రాష్ట్ర విభజన చేయబోతున్నామని సోనియాగాంధీ నాకెన్నడూ చెప్పలేదు. ఆవిషయం తెలిసినప్పతి నుండి నేను వ్యతిరేఖిస్తూనే ఉన్నాను. కానీ నాతో బాటు ఆ విషయం తెలిసిన చిరంజీవి వంటివారు అందరూ అధిష్టానానికి విదేయులుగా మేలుగుతూప్రజలను మభ్యపెడుతూ నేటికీ తమ మంత్రి పదవులలో కొనసాగుతున్న విషయం నిజం కాదా? అటువంటి వారి విమర్శలకు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నేను జవాబు చెప్పవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. నన్ను విమర్శించే ముందు, మొదట తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రశ్నలకు ఆయన జవాబీయగలిగితే బాగుటుంది," అని అన్నారు.

 

జగన్ గురించి మాట్లాడుతూ, "నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విషయంలో కలుగజేసుకోలేదనే విమర్శలు తర్కబద్దంగా లేవు. ఆయన వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను కలుగజేసుకోవడం సరికాదు. ఆయన సంగతి కోర్టులే చూసుకొంతాయి. ఆయన ముఖ్యమంత్రి అవడానికి నోటికి వచ్చినహామీలు గుప్పిస్తున్నారు. అయితే అవి ఆచరణ సాధ్యం కానివి. వాటిని అమలుచేసే చిత్తశుద్ది ఆయనకు అసలు లేదు. నా స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనవసరం," అని అన్నారు.

 

ఇక జైసపాలో చేరుతామని చెప్పిన వారు అందరూ ఒకరొకరుగా ఎందుకు పార్టీ విడిచి వెళ్ళిపోయారు? మీ పార్టీ ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబిస్తూ “చాలా మంది ఎవరి స్వార్ధం, భవిష్యత్తు, టికెట్స్ వారు చూసుకొని వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం రాష్ట్ర ప్రజల తరపున పోరాడేందుకే నేటికీ కట్టుబడి ఉన్నాను. మా పార్టీ ఎన్నికలలో గెలుస్తుందా లేదా అనేది ప్రధానం కాదు. నా ఆలోచన అంతా ప్రజలను చైతన్యవంతులను చేసి వారికి మంచి భవిష్యత్ ఏర్పరచాలనే తప్ప వేరొకటి లేదు,”అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.