మళ్ళీ బ్యాట్ పక్కన పడేసిన సమైక్య చాంపియన్

 

కిరణ్ కుమార్ రెడ్డి ఆర్నెల్లు మీన మేషాలు లెక్కించిన తరువాత జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు కానీ ఆ పార్టీ గ్రహస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదని మొదటి రోజు నుండే స్పష్టమవుతూ వచ్చింది. అయినప్పటికీ ఆ ఏకవీరుడు కాళ్ళకి బూట్లు బదులు చెప్పులు తొడుక్కొని, రెండో వైపు బ్యాట్స్ మ్యాన్ ఎవరూ లేకపోయినా ఒంటరిగా బ్యాటు పట్టుకొని సమైక్యాట మొదలుపెట్టారు. కానీ, లాస్ట్ బాల్ ఆడాల్సిన పరిస్థితి వచ్చేసరికి తన బ్యాటుని తమ్ముడు కిషోర్ రెడ్డి చేతికి అందించి ఆయన ఆట నుండి తప్పుకొన్నారు. పోటీచేసి ఓడిపోవడం కంటే, పోటీ చేయకుండా పరువు నిలుపుకోవడమే మేలని ఆయన భావించారేమో. తను అధికారంలో ఉండగా చాలా ముందు చూపుతో తన పీలేరు నియోజక వర్గానికి ఆయన వందల కోట్ల నిధులు విడుదల చేసుకొన్నపటికీ, అక్కడి నుండి పోటీ చేస్తే గెలవలేననే దృడనమ్మకం చేతనే ఆయన పోటీ చేయడం లేదు. అటువంటప్పుడు ఆయన పార్టీలో మిగిలిన అభ్యర్ధులు మాత్రం గెలుస్తారని ఎవరు మాత్రం భావించగలరు?

 

ఏమయినప్పటికీ తెదేపా-వైకాపాల మధ్య విజయమో వీర స్వర్గమో అన్నట్లు జరగబోతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆయన చెప్పులు అరిగేలా ఎంత ప్రచారం చేసినా గెలవడం అసంభవమని సామాన్య ప్రజలు కూడా చెప్పగలరు. మరి మూడేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ సంగతి తెలియదని ఎవరూ భావించలేరు. అందుకే ఆయన సగౌరవంగా పోటీ నుండి తప్పుకొన్నారని భావించవలసి ఉంటుంది..

 

ఇక ఈ ఎన్నికలలో గెలవలేనప్పుడు, మళ్ళీ ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తూ పార్టీని నడపడటం చాల కష్టం కనుక ఆయన కూడా చిరంజీవిలాగే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం తధ్యం. అయితే ఆ నాటి పరిస్థితుల్లో చిరంజీవి ఎంతో కొంత ప్రయోజనం పొందగలిగారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.

 

కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో కానీ, కేంద్రంలో గానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఒకవేళ తెలంగాణాలో అధికారంలోకి వచ్చినా, అది వేరే రాష్ట్రమయిపోతుంది గనుక ఏకవీరుడు-కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎటువంటి ప్రయోజనమూ పొందలేరు. అయితే ఒంటరిగా గోళ్ళు గిల్లుకొంటూ కాలక్షేపం చేయడం కంటే కాంగ్రెస్ లో చేరిపోవడమే మేలు. లేదా ఇదివరకు ఆయనే స్వయంగా ప్రకటించినట్లుగా రాజకీయ సన్యాసం తీసుకోవడం ఆయన ముందున్న మరో ఆప్షన్. అయితే ఆయనది రాజకీయ సన్యాసం తీసుకొనే వయసు కాదు గనుక తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చును. అది చూసి ప్రజలు జోగీ జోగీ రాసుకొంటే బూడిద రాలినట్లుంది’ అని ఎకసెక్కెం చేసినా భరించక తప్పదు. పరిస్థితులు ఆలాంటివి మరి.