అసమ్మతి నేతలే ముఖ్యమంత్రిని నిలువరించారా?

 

ముఖ్యమంత్రి మళ్ళీ డిల్లీ తిరిగొచ్చారు. ఈసారి కూడా ఆయన మంత్రి వర్గంలో అసమ్మతి వాదులను బయటకి పంపేందుకు, మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పుల ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలుపకపోవడంతో ఆయన నిరాశగా తిరిగి వచ్చి మళ్ళీ తన ఇందిరమ్మ కలలలో మునిగిపోయారు. ఈసారి ఆయన పర్యటనలో కొన్ని నామినేటడ్ పదవులను నింపుకోవడానికి మరికొన్ని శాఖపరమయిన మార్పులు చేసుకోవడానికి మాత్రమే అనుమతి సంపాదించుకొన్నారు.

 

అసమ్మతి మంత్రులను తొలగించి, దానివల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి సిద్దపడుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేయడం విశేషం. ప్రస్తుతం తెలంగాణా యంపీల తెరాస జంపింగ్ సీరియల్ నడుస్తోంది గనుక, మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసి కొత్త సమస్యను నెత్తినెత్తుకోవడం కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేసి ఉండవచ్చును. లేదా, బొత్స సత్యనారాయణ తదితర అసమ్మతి నేతలు అధిష్టానానికి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖంగా చేస్తున్న పిర్యాదులను దృష్టిలో పెట్టుకొని, ఎవరినీ ఖాతరు చేయని కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ మరో రాజశేఖర్ రెడ్డిలా తయారు కాకూడదనే ఆలోచనతోనే ఆయన ప్రతిపాదనలను ఆమోదించకుండా, ఆయనకు పక్కలో బల్లెంలా అసమ్మతి నేతలను ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కావచ్చును. అందువల్ల మరికొంత కాలం రామచంద్రయ్య, డీ.యల్.రవీంద్రా రెడ్డి వంటి వారికి వెసులు బాటు దొరికినట్లే.

 

ముఖ్యమంత్రి డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారి నెత్తిపై కట్టి వ్రేలాడుతున్నట్లేనని చివరికి మీడియా కూడా దృడంగా నమ్ముతోందంటే, వారిపట్ల ముఖ్యమంత్రికి ఎటువంటి అభిప్రాయం ఉందో అర్ధం అవుతుంది. అధిష్టానం వారిని తొలగించడానికి ఆమోదముద్ర వేయలేదు కనుక, త్వరలో మళ్ళీ ఎదో ఒక అవకాశం దొరకగానే మళ్ళీ ముఖ్యమంత్రి పై విమర్శల వర్షం కురిపించవచ్చును. ఇది ముఖ్యమంత్రి ఇబ్బందికరమే అయినప్పటికీ భరించక తప్పదు.