కిరణ్ రోడ్డు మ్యాపే అధిష్టానం ఫాలో అవుతుందా!

 

ఇంత వరకు తెలంగాణా అంశంపై నిర్ణయం చేసే బాధ్యత అధిష్టానం మీదనే ఉందంటూ, ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా నిశ్చింతగా కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రోడ్డు మ్యాప్ తయారు చేయమని దిగ్విజయ్ సింగ్ ఆదేశించినప్పటి నుండి రాష్ట్ర విభజన సమస్య తలకి చుట్టుకొన్నట్లయింది. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉందని చెప్పవచ్చును. వారిద్దరూ సమైక్యవాదులయినప్పటికీ, కీలకమయిన పదవులలో ఉన్నందున, ఇంత కాలం తెలంగాణా అంశం తమ చేతుల్లో ఏమీ లేదని, అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకొంటామని చెబుతూ, పెద్దగా ఇబ్బంది కలగకుండానే రోజులు దొర్లించేసారు.

 

అయితే, ఈ రోజు రాష్ట్ర విభజనపై ప్రకటనకి ముహూర్తం ఖరారయిపోవడంతో, వారిద్దరూ తమ వైఖరి కూడా ప్రకటించక తప్పట్లేదు. వారు బహుశః ఇప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకే మొగ్గు చూపుతున్నపటికీ, సీమంధ్రా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా తమ ప్రాంత నేతల మనోభావాలను అధిష్టానానికి తెలియజేసి తదనుగుణంగా నిర్ణయం వచ్చేలా కృషి చేయక తప్పట్లేదు. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో మఖాం వేసిన సీమంధ్ర నేతలని కలిసిన వెంటనే, అక్కడి నుండి నేరుగా సోనియా గాంధీని కలిసి రావడం జరిగింది. అంటే, ఆయన వారి అభిప్రాయాలను, నిర్ణయాలను అధిష్టానానికి చేరవేసినట్లు భావించవచ్చును. కానీ అక్కడే మఖాం వేసి ఉన్న టీ-కాంగ్రెస్ నేతలని మాత్రం ఆయన కలిసినట్లు ఎటువంటి సమాచారం లేదు.

 

అందువల్ల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జోరుగా లాబీయింగ్ చేస్తునట్లు భావించవచ్చును. ఈవిధంగా సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశానికి ముందే, వారిరువురూ పార్టీ అధిష్టానంపై ఇంత తీవ్రమయిన ఒత్తిడి తెస్తే, ఆ సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశం తరువాత, మళ్ళీ తెలంగాణపై నాన్పుడు ధోరణి అవలంభిస్తే, అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయనే కారకులని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు భావించడం ఖాయం, తత్ఫలితంగా వారిరువురికీ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తీవ్రవ్యతిరేఖత ఎదురవడం కూడా అంతే ఖాయం. మరి కాంగ్రెస్ అధిష్టానం వారిరువురుకి అటువంటి పరిస్థితి కల్పిస్తుందో లేక తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందో ఈ రోజు సాయంత్రం సమావేశం ముగిస్తే గానీ తెలియదు.