ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్య ఉన్నట్టే...

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ముందు వరుసలో ఉంటాయి. శరీరంలోని మలినాలను తొలగించడానికి, ఎలక్ట్రొలైట్స్ ను సమన్వయం చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్తకణాల సంఖ్యను మెరుగుపర్చడానికి... ఇలా ఎన్నో సక్రమంగా జరగడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అలాంటిది వాటికేదైనా సమస్య వస్తే? ఎంత కష్టమో కదా? అయితే కాస్త జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిస్తే... సమస్య ముదిరిపోకముందే కిడ్నీలను కాపాడుకోవచ్చు.

 

రక్తహీనత గానీ ఏర్పడిందంటే ఓసారి కిడ్నీల గురించి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చేసే ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. అది సరిగ్గా విడుదల కాక ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వచ్చిందంటే కిడ్నీల పని తీరు సరిగ్గా లేకపోవచ్చు. రక్తహీనత తీవ్రమైతే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందక బద్దకం, దేనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కిడ్నీల మీద ఓ కన్నేయాల్సిందే. ఒకవేళ కిడ్నీల చుట్టుపక్కల నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లుగానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఉన్నట్టు లెక్క. ఆకలి తగ్గిపోయినా, ఏదైనా తిన్నప్పుడు ఆ రుచి ఏదైనా లోహం నోటిలో పెట్టుకున్నట్టుగా అనిపించినా అది కిడ్నీల పనితీరు దెబ్బతిని రక్తంలోమలినాలు పెరిగిపోయాయనడానికి సూచన.

 

తరచుగా ర్యాషెస్, దురద, మంట వంటివి వస్తున్నా గమనించుకోవాలి. రక్తంలో మలినాలు పెరిగిపోతే చర్మం పొడిబారిపోయి ఇలాంటివి వస్తాయి. ముఖం, మోకాళ్లు, కీళ్లు ఉబ్బిపోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో హెచ్చుతగ్గులు కూడా సూచనలే. ఇక  ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలు. తరచూ మూత్రం రావడం, లేదంటే రావాల్సినంత రాకపోవడం, మూత్రంలో మంట, నొప్పి, రంగు మారడం, నురగతో కూడిన మూత్రం... ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరు దెబ్బ తిన్నదని చెప్పకనే చెబుతాయి. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.