తెలంగణా ముఖ్యమా ఉద్యమాలు ముఖ్యమా?

 

ఇటీవల తెరాస కండువా కప్పుకొన్న కాంగ్రెస్ నేత కే.కేశవ్ రావు ఈరోజు తన కొత్తబాస్ కేసీఆర్ మనసులో మాటను చల్లగా బయటపెట్టాడు. “కాంగ్రెస్ పార్లమెంటులో బిల్లుపెట్టేవరకు కూడా తెలంగాణా ఇస్తుందని తమకు నమ్మకం లేదని, ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా ఇవ్వకపోయినా మరో ఆరునెలలు కోట్లాడి సాధించుకొంటామని” ఆయన చెప్పారు. అంటే తెలంగాణా సాధన కంటే, ఆ పేరిట మరో ఆరునెలలు ఉద్యమాలు చేసుకొనే అవకాశం ఉంటేనే మేలని ఆయన ఉద్దేశ్యం కాబోలు.

 

ఆయన కాంగ్రెస్ లో ఉన్నంతకాలం తెలంగాణా కోసం గొంతు చించుకొని మాట్లాడేవారు. తమ పార్టీ తెలంగాణా ఇవ్వదని, పార్టీలో ఉంటూ ఎటువంటి ఉద్యమాలు చేసే అవకాశం లేదని భావించిన కేశవ్ రావు, తెరాసలో చేరితే చురుకుగా ఉద్యమాలలో పాల్గొనవచ్చుననే ఉద్దేశ్యంతో, తనకి అత్యున్నత హోదానిచ్చిన కాంగ్రెస్ కండువాని చెత్త కుండీలోకి విసిరేసి, తెరాస కండువా వేసుకొన్నారు. కానీ, ఆయన పార్టీ మారగానే పరిస్థితులు కూడా ఒక్కసారిగా మారిపోయాయి.

 

అంతవరకు ఉద్యమాలతో కాంగ్రెస్ ను ఒక ఆట ఆడించిన తెరాస చేతిలోంచి తెలంగాణా సెంటిమెంటును కాంగ్రెస్ కాకి రివ్వున వచ్చిఎత్తుకుపోయింది. ఇప్పుడు అది తెరాసను పక్కన పడేసి తానే స్వయంగా తెలంగాణా ఇచ్చేందుకు సిద్దం అవుతుండటంతో, ఎన్నెన్నో ఆలోచనలతో పార్టీ మారిన కేశవ్ రావుకి ఇప్పుడు ఏమిచేయాలో పాలుపోవడం లేదు. ఒకపక్క కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేస్తానని హడావుడిపడుతుంటే, ఇక ఉద్యమాల అవసరం ఏముంటుంది. తెరాసలో ఉండి చేసేదేముంటుంది?

 

అదేవిధంగా తెలంగాణా కోసం తన తల నరుకొన్నేందుకు కూడా సిద్ధమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, ఇప్పుడు తెరాసను విలీనం చేస్తే తెలంగాణా ఇస్తానని కాంగ్రెస్ చెపుతున్నపటికీ, ఎందుకు వెనకాడుతున్నట్లు? అంటే ఆయనకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకంటే, తన రాజకీయ ప్రయోజనాలు, పార్టీని నిలుపుకోవడమే ముఖ్యమని అర్ధం అవుతోంది.

 

ఒకవేళ కేసీఆర్, కేశవ్ రావులు నిజంగా మనస్పూర్తిగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని కోరుకొంటుంటే, అందుకోసం తమ బేషజాలు, కోరికలు, కలలు, రాజకీయ ప్రయోజనాలు అన్నీటినీ పక్కనబెట్టి, తెలంగాణా ఏర్పాటుకి తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహకరించి ఉండాలి. కానీ, వారిద్దరూ ఆవిధంగా చేసేందుకు సిద్ధంగాలేరు.

 

తెలంగాణా సెంటిమెంట్ సజీవంగా నిలిస్తేనే తెరాస కలలుకంటున్నట్లు వచ్చేఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేస్తే అప్పుడు కాంగ్రెస్ హస్తానిది పైచేయి అవుతుంది. గనుక, వచ్చే ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని, ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పారు.

 

మరి, తెలంగాణా వద్దంటున్న ఇటువంటి నేతలను నిలదీయకుండా, తెలంగాణాకి అడ్డుపడుతున్నారని వేరేవరినో నిందించడం ఎందుకు?ఇటువంటి నేతల శల్యసారధ్యంలో సాగుతున్న తెలంగాణా ఉద్యమం కోసం, ఉజ్వల భవిష్యత్తు ఉన్నవిద్యార్ధులు బలిదానాలు చేసుకోవడం వల్ల ఏమి ప్రయోజనం?ఎవరికి లాభం కలుగుతుంది?