కేజ్రీవాల్ కు కౌగిలి కష్టాలు.. లాలూనే లాక్కొని కౌగిలించుకున్నారు


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి కౌగిలింత కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటీ అనుకుంటున్నారా.. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈ నెల 20వ తేదీన పాట్నాలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నితీశ్ కుమార్ పలువురు ప్రముఖుల్ని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచారు. దీంతో కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్ ఆలింగనం చేసుకున్నారు. అంతే కేజ్రీవాల్ పై విమర్శలు మొదలయ్యాయి. ఇతర పార్టీనేతలే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం దాణా కుంభకోణంలో శిక్షపడిన కళంకిత నేత లాలూను ఎలా కౌగిలించుకుంటారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారంట. ఇక మీడియా అయితే ఒక మెట్టెక్కి  ‘నీతితో అవినీతి కౌగిలించుకున్న వేళ’ అంటూ ఒకటే ఏకిపారేశారు. దీంతో కేజ్రీవాల్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ నేనూ కావాలని కౌగిలించుకున్నది కాదని.. లాలూనే తనను లాక్కుని ఆలింగనం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. పనిలో పనిగా లాలూపై అతని కొడుకులపై రెండు విమర్శల బాణాలు వదిలారు. నిజానికి తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, పట్నాలో జరిగింది వారసత్వ రాజకీయమేనని, లాలూ ఇద్దరు తనయులు నితీశ్‌ కేబినెట్‌లో చోటు సంపాదించారని చెప్పారు. మరి కేజ్రీవాల్ ఇచ్చిన క్లారిటీతో అయినా ఆయనపై విమర్శలు చేయడం ఆపుతారో లేదో చూడాలి.