రేవంత్ రెడ్డి పేరెత్తని కేసీఆర్.. ఇదేం లెక్క?

 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలిచినట్టే అని తనకు అర్థమైందని అన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్‌ను అభివృద్ధి చేసే పూచీ తనదంటూ భరోసా ఇచ్చారు.

గతంలో గర్భిణుల ప్రసవానికి వెళ్తే పైసలు ఖర్చయ్యేవి. నేడు ప్రభుత్వమే గర్భిణులకు తిరిగి డబ్బులు ఇచ్చి ప్రసవాలు చేయించి బిడ్డలతో పాటు అమ్మ ఒడి వాహనంలో వారిని ఇంటికి చేరుస్తోంది. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నాం. వాస్తవాలను గమనించి ఈసారి టీఆర్ఎస్ గెలిపిస్తే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తాం. నిరుద్యోగ యువకులకు రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతులకు రైతుబంధుతో పాటు రైతు భీమా కల్పిస్తున్నాం. ప్రపంచమంతా రైతుబంధును చూసి ఆశ్చర్యపోతోంది. పేదలు, దళితులు, మైనార్టీల గురించి మేం పట్టించుకున్నాం అన్నారు.

గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని, ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇలా ఎందుకు చేయలేకపోయాయని నిలదీశారు. కొడంగల్ 41 తండాలను గ్రామపంచాయతీలు చేశామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేం కష్టపడడం వల్లే కరెంట్‌ ఇవ్వగలుగుతున్నామని, కాంగ్రెస్‌, టీడీపీకి కరెంట్‌ ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదని కేసీఆర్ అన్నారు. మైనార్టీల కోసం రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశామని, వారి అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.

పాలమూరుకు శత్రవులు బయట లేరు. ఈ జిల్లాలోనే ఉన్నారు. ఎంతమందితో కేసీఆర్‌ కొట్లాడాలి?. పాలమూరు కరవు జిల్లా. కొండలు, బండలు రాళ్లు.. ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలని పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును మొదలుపెట్టాం. రూ.35వేల కోట్లు మంజూరు చేశాం. అది పూర్తయితే 20లక్షల ఎకరాలకు నీరు అంది ఆకుపచ్చ పాలమూరుగా మారుతుంది. ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అలాంటి చంద్రబాబును కాంగ్రెస్‌ నెత్తిపై పెట్టుకొని తెలంగాణలోకి తెస్తోంది. పాలమూరు దరిద్రం పోవాలంటే అడ్డుపడేవాళ్లకు బుద్ధి చెప్పాలి. 14 ఏళ్లు మడమ తిప్పకుండా నిలబడి పోరాడితే.. చావు నోట్లో తలకాయి పెడితే తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను మళ్లీ ఆంధ్రాకు అప్పగిస్తారట. ప్రజాకూటమి గెలిస్తే పాలమూరు ప్రాజెక్టు నీళ్లు ఆపేస్తారు. కొడంగల్‌ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిని గెలిపించండి. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఇక్కడకి నేనే స్వయంగా వచ్చి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. సాగునీరు, విద్యా సంస్థలు తీసుకొస్తాం. సొంత ఆర్థికవనరులు కల్గిన రాష్ట్రం తెలంగాణ. సంపదకు కొదవలేదు. కొడంగల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలు నెలలోపు ఏర్పాటు చేస్తాం అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

అయితే రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండానే కేసీఆర్ ప్రసంగం ముగించారు. కేసీఆర్ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొడంగల్ లో బంద్ కి పిలుపునివ్వడం.. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో ఈ రోజు రేవంత్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. కాసేపటి క్రితమే రేవంత్ ని విడుదల చేశారు. కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. అలాంటి రేవంత్ నియోజకవర్గంలో కేసీఆర్ సభ పెట్టడంతో.. కేసీఆర్ రేవంత్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే కేసీఆర్ మాత్రం కనీసం రేవంత్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మీద విమర్శలు చేసే కేసీఆర్.. రేవంత్ మీద విమర్శలు చేయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 20 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కొడంగల్ అభివృద్ధి, టీఆర్ఎస్ అభ్యర్థి గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. అనంతరం తనకు వేరే సభ ఉందంటూ ప్రసంగాన్ని ముగించారు.