తెరాస అధినేత వ్యూహం ఫలించేనా?

 

అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన కేసీఆర్‌ మళ్ళీ అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.కానీ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు నిరసన గళం వినిపించటంతో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.ఓ పక్క మహాకూటమి,మరో పక్క అభ్యర్థులపై అసంతృప్తి నేపథ్యంలో స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు.ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రచారం చేసేవిధంగా పక్కా ప్రణాళిక రూపొందించారు.దాదాపుగా 56 నియోజకవర్గాలకు ప్రచార తేదీలు ఖరారయ్యాయి. మిగిలిన వాటి గురించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్‌ స్వయంగా నియోజకవర్గ నేతలతో ఫోన్‌లో మాట్లాడి ప్రచారానికి అనువైన తేదీ గురించి వారితో చర్చించి ఖరారు చేస్తున్నట్లు సమాచారం.

నియోజకవర్గాల వారీ ప్రచార సభల సందర్భంగా స్థానిక నేతలతో భేటీ కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తద్వారా అక్కడి పరిస్థితులను నేరుగా తెలుసుకోవడంతో పాటు సమస్యలుంటే పరిష్కరించడం, సమర్థంగా ప్రచార నిర్వహణ వంటి వాటిపై దిశా నిర్దేశం చేస్తారు.సమావేశాలకు పిలిచే నాయకుల పేర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు సీఎం ఆదేశించారు.నియోజకవర్గ స్థాయి ప్రచార, సమన్వయ బాధ్యతలను తమ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు తెరాస అప్పగించనుంది.

ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్‌ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు.మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి 20 నుంచి 30 మంది సూక్ష్మ పరిశీలకులను పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించుతోంది. గ్రామాల్లో గడప గడపకూ వెళ్లి స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయటమే వీరి పని.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు.అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లనూ సూక్ష్మ పరిశీలకులు గుర్తించి, ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానానికి నివేదికలు చేరవేస్తారు.తొలుత పార్టీ అభ్యర్థులపై కొంత వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సూక్ష్మ పరిశీలకులను పంపించాలని నిర్ణయించారు.