బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు.. బుద్ధి లేదా

posted on: Dec 5, 2018 10:43AM

 

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సహనం కోల్పోతున్నారు. ప్రచారంలో భాగంగా తీరిక లేకుండా నిర్వహిస్తున్న వరుస సభలు వల్లనో, లేక మరేదైనా కారణం వల్లనో తెలీదు కానీ.. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏ చిన్న అంతరాయం కలిగినా ప్రజలు, కార్యకర్తలు పైన మండిపడుతున్నారు.

అలంపూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతుండగా వందలమంది కార్యకర్తలు కేరింతలు కొడుతూ తోసుకొచ్చారు. దీంతో కేసీఆర్‌ ‘బాబూ లొల్లెందుకు చేస్తున్నావయ్యా? తిరుమలరెడ్డిగారూ ఎవరో ఒకరు పోండి. కూచోరాదు వయా బాబూ!. ఎందుకయ్యా అల్లరి!. కూర్చొండి!’ అంటూ వారించారు. తిరిగి ప్రసంగం ప్రారంభించారు. కొద్ది సేపటికే మళ్లీ గోల జరగడంతో ‘ఏఏ కూసోవయ్యా, వాలంటీర్లను కూర్చొమ్మని చెప్పండి’ అని హరీష్ రావు వైపు చూసి అన్నారు. అయినా గోల జరుగుతుండటంతో.. కొద్దిసేపటికి సముదాయింపు కాస్త ఆగ్రహంగా మారింది. ‘ఇలా అరిస్తే వేదిక దిగి పోతా. తుమ్మిళ్ల నీళ్లు బందయితయి. కామ్‌గ కూసోవలె కదా! నేనింకా ఐదారు సభలకు పోవాలె’ అని వ్యాఖ్యానించారు. అయినా అలజడి తగ్గక పోవడంతో మాట మరింత కఠినమైంది. ‘బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు. బుద్ధి లేదా. పిచ్చోళ్లయినట్లున్నారు' అని విరుచుకుపడ్డారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కలగజేసుకుని, ‘కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు సార్‌’ అనడంతో.. ‘అర్థం లేని ఉత్సాహం. ఈ ఉత్సాహమే కొంపలు ముంచుతుంది’ అని అన్నారు.

వికారాబాద్‌ సభలోనూ కేసీఆర్‌ సహనం కోల్పోయారు. మాట్లాడుతున్న సమయంలో వాటర్‌ ప్యాకెట్లు ఉన్న క్రేట్లను పెద్ద ఎత్తున శబ్దం వచ్చేట్లు విసిరేస్తుంటే మండిపడ్డారు. ‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’ అంటూ వలంటీర్లను కేసీఆర్ తిట్టారు. కేసీఆర్ సహనం కోల్పోయి మాట్లాడిన మాటల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కేసీఆర్ సహనం కోల్పోయేలా చేస్తున్నది వరుస సభలో లేక సర్వేలో ఆయానికే తెలియాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...