TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మాటేమిటంటూ కేసీఆర్ ను నిలదీస్తున్న విపక్షాలు

Published on: Wed May 25, 2022 11:11AM

తెలంగాణలో రైతు సంక్షేమం అద్భుతంగా ఉందని ఒక వైపు తెరాస సర్కార్ భుజాలు చరుచుకుంటుంటే.. మరో వైపు రైతు ఆత్మహత్యల సంగతేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీరే మార్గం కానరాక, రైతు బంధు, రుణమాఫీలు అక్కరకు రాక తెలంగాణలో  రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు.

ఒక్క సోమవారం రోజే రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లాలో ఒకరు, వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున పురుగుల మందు తాగి తనువు చాలించారు. రైతు సంక్షేమం అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలేనా అన్న అనుమానం కలిగేలా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రైతుల కడగండ్లు పట్టించుకోకుండా పంజాబ్ రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రజల సొమ్ముకు కేసీఆర్ పందేరం చేయడాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి.

ముందు స్వరాష్ట్రంలో రైతుల కష్టాలు కడతేర్చిన తరువాత ఇతర రాష్ట్రాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో వ్యక్తిగత గుర్తింపు కోసం  రాష్ట్ర ప్రజల సొమ్ము పందేరం చేసే అధికారం ఎవరిచ్చారంటూ నిలదీస్తున్నారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఇచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన రైతు బానోతు హరి, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కల పల్లికి చెందిన భూక్యా రాజు,   కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన   జునుమాల కొమరయ్యలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అప్పులు తీరే మార్గం కానరాకపోవడమే. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్లనే.

రైతు శ్రేయస్సే తెరాస సర్కార్ ధ్యేయం లక్ష్యం అంటే పదే పదే వల్లెవేసే కేసీఆర్ రాష్ట్రంలో రైతుల  ఆత్మహత్యలను పట్టించుకోకుండా,ఇరత రాష్ట్రాలలో రైతులకు ఆర్థిక సహాయం అంటూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం పట్ల రాష్ట్ర రైతాంగంలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.