విలీనానికి కేసీఆర్ సై ఎందుకు

 

కాంగ్రెస్ అధిష్టానం నిన్న తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత దిగ్విజయ్ సింగ్ చేసిన పార్టీ విలీనం వ్యాక్యలకు స్పందిస్తూ “తాను మాట తప్పే మనిషిని కాదని, అయితే, పార్టీ విలీనం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన కోరారు. ఆ తరువాత ఆ పార్టీ రాష్ట్ర విభజనను ఏవిధంగా చేయాలనుకొంటున్నదో, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి తన ఉద్దేశ్యాలు ఏమిటో వంటి విషయాలను స్పష్టం చేయాలని కోరారు. అది గాక, పార్టీ విలీనం చేసేందుకు రెండు పార్టీల మధ్య తగిన ఒప్పందం జరిగిన తరువాతనే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనం చేయడానికి అభ్యంతరం ఏమి లేదన్నట్లే ఆయన మాట్లాడారు.కానీ, తెలంగాణాలో పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం గమనిస్తే, వీలయితే తన పార్టీ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే కోరిక ఆయనలో ఉందని అర్ధం అవుతోంది.

 

అయితే, కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండానే తెలంగాణా ప్రకటన చేయడంతో ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవుతుందని ఆయనకీ తెలుసు. మారిన పరిస్థితుల్లో బలపడిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో డ్డీకొని మొక్కుబడిగా సీట్లు సంపాదించుకొని ప్రతిపక్ష బెంచీలకి పరిమితమయి పోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తన ప్రాభల్యం తగ్గిపోవడం ఖాయం. అంతకంటే, కాంగ్రెస్ లో తెరాసను విలీనం చేసి రానున్న ఎన్నికలకి తన పార్టీ నేతలకి వీలయినన్ని ఎక్కువ టికెట్స్  దక్కేలా చూసుకొంటే, కాంగ్రెస్ తో పోటీపడేబదులు దాని బలమయిన మద్దతు కూడా పొంది అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చును. ఒకవేళ కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనాలని భావించినా కూడా మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఆపార్టీలో నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలుపెడితే ఇక వారిని ఆపడం ఆయన తరం కాదు. అప్పుడు ఆయన ఎటువంటి షరతులు పెట్టకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు అంగీకరించక పోవచ్చును. అంతకంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే మేలని అర్ధం చేసుకొన్నకేసీఆర్ విలీనం గురించి సానుకూలంగా స్పందించారు.