తెలంగాణపై కాంగ్రెస్, కేసీఆర్ కొత్త డ్రామా షురూ

 

తెలంగాణా రాష్ట్ర సాధించడానికే జన్మించిన కారణ జన్ముడనని చెప్పడం ఒక్కటే మిగిలిపోయింది కేసీఆర్ కి. తెలంగాణా రాష్ట్ర సాధన తనవల్ల తప్ప మరెవరివల్ల సాధ్యంకాదని అందరినీ నమ్మించగలిగిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా కాకిలా వచ్చి తన చేతిలో ఉన్నతెలంగాణా ఉద్యమాన్ని ఎత్తుకుపోవడంతో బిత్తరపోయాడు. అయితే, మళ్ళీ వెంటనే తేరుకొని, కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ తెలంగాణా ఇచ్చే దైర్యం లేదని కనిపెట్టిన ఆయన, ‘తన ప్రమేయం లేకుండా కాంగ్రెస్ గనుక తెలంగాణా ప్రకటించుకొంటే, ఇక ఆ పార్టీలో విలీనం కుదరదని’ తేల్చి చెప్పేసాడు.

 

కాంగ్రెస్ కూడా అతని పార్టీని కలుపుకోవడానికి మొదట అయిష్టత చూపినప్పటికీ, అతనిచ్చిన ఐడియాతోనే తెలంగాణా అంశం మరికొంత కాలం సాగదీయవచ్చునని అర్ధమవడంతో మళ్ళీ డీ.శ్రీనివాస్ ద్వారా కేసీఆర్ తో రాయభారం మొదలుపెట్టింది. అదే విషయాన్నీ శ్రీనివాస్ కూడా ధృవీకరించారు.

 

ఇందులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే, తన చేతిలోంచి తెలంగాణా అంశాన్ని ఎత్తుకుపోయిన కాంగ్రెస్ తో కలవకూడదని బెట్టు చేయడం ద్వారా, కేసీఆర్ తెలంగాణాను వెనక్కి జరిపితే, అతని పార్టీ విలీనం అయితే తప్ప తెలంగాణా సాద్యం కాదనే సాకుతో కాంగ్రెస్ పార్టీ కూడా మరికొంత కాలం తెలంగాణా అంశాన్ని సాగదీయాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది.

 

మొన్న టీ-కాంగ్రెస్ నేతల సభలో “కాంగ్రెస్ వల్లనే తెలంగాణా సాధ్యం” అని తన నేతలతో చిలక పలుకులు చెప్పించిన కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ని పక్కన బెట్టి తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ ని మొత్తం స్వంతం చేసుకోవాలని యోచించినా, దానివలన సీమంద్రా నేతల నుండి కొత్త తల నొప్పులు మొదలవడం గమనించగానే, మళ్ళీ కేసీఆర్ తో రాయభారం సీనుకు తెర తీసింది.

 

కేసీఆర్ తో మొదలుపెట్టిన ఈ ‘రాయబేరం సీను’ని తెలంగాణా ఆలోచన లేకుంటే చర్చల పేరిట మరి కొంత కాలం సాగదీసుకోవచ్చును, ఇద్దరికీ లాభం ఉంటుందనుకొంటే వెంటనే ముగించుకోవచ్చును. బేరసారాలు కుదరకపోతే చెడగొట్టుకోవచ్చు కూడా.

 

ఇది కాంగ్రెస్ ఆలోచన అయితే, మరో పదినెలలపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై నిర్ణయం తీసుకోనీయకుండా అడ్డుపడగలిగితే, అప్పుడు తెలంగాణా సెంటిమెంటుతో రానున్న ఎన్నికలలో 15/100 సీట్లు సాధించి కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆలోచన. మరో పది నెలలో దివ్యమయిన భవిష్యత్తును ఎదురుగా పెట్టుకొని, కాంగ్రెస్ లో విలీనం చేసుకొని దానిని చేజేతులా కేసీఆర్ పాడు చేసుకోకపోవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తే, ఇంతకాలం రాజాల్లాగ బ్రతికిన కేసీఆర్ ఆయన పరివారం సోనియా, రాహుల్ గాంధీల ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి రావడమే గాక, శతకోటి కాంగ్రెస్ నేతలతో అధికారం కోసం పోటీలుపడక తప్పదు.

 

అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ‘రాయబేరాలను’ అవుననకుండా కాదనకుండా మరికొంత కాలం సాగదీస్తూ కాలక్షేపం చేసేస్తే ఎలాగు అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి గనుక, అప్పుడు తన కలలు సాకారం చేసుకోవచ్చునని కేసీఆర్ ఆలోచన. కాంగ్రెస్ కూడా కేసీఆర్ నుండి సరిగ్గా అదే కోరుకొంటోంది.

 

దానర్ధం ఆజాద్ ప్రతిపాదించిన తాజా సిద్ధాంతం ప్రకారం ‘పది రోజుల్లోతెలంగాణా అంటే పదిరోజులని కాదు. పది వారాలో, పది నెలలో తెలంగాణా’గా మనం అర్ధం చేసుకోక తప్పదు