TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కశ్మీర్‌లో మిలిటెంట్ల హవా

Published on: Tue May 17, 2016 2:26PM

 

కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీరం మళ్లీ రాజుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకు సాక్ష్యంగా వారం వారం ఏదో ఒక చోట నుంచి ఎన్‌కౌంటరుకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మరణించారనీ, మరి కొందరు తప్పించుకున్నారనీ సైన్యం తెలియచేసింది. పఠాన్‌కోట్‌ దాడి తరువాత మన దేశం పాకిస్తాన్‌ మీద కానీ, ఆ దేశంలో బోర విరుచుకుని తిరుగుతున్న సూత్రాధారి మౌలానా మసూద్‌ అజార్‌ మీద కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోవడం... తీవ్రవాదుల దృష్టిలో చులకన అయ్యేందుకూ, వేర్పాటువాదులు తమ గొంతుకను పెంచేందుకూ అవకాశమిచ్చినట్టు అయ్యింది. పైగా చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్‌ తీవ్రవాదులను వెనకేసుకుని రావడంతో వారికి నైతిక స్థైర్యం చిక్కుతోంది. దీనికి అనుగుణంగానే కశ్మీరంలో ఇప్పుడు తిరుగుబాటు ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. సైన్యం తీవ్రవాదుల మీద కాల్పులు జరిపే సందర్భంలో అక్కడకి అల్లరి మూకలు చేరుకుని జాతి వ్యతిరేక నినాదాలు చేయడం సాధారణంగా మారిపోతోంది. ఒక పక్క ఎన్‌కౌంటరు జరుపుతుంటే మరో పక్క దగ్గర్లోని మసీదుల మైకుల నుంచి తీవ్రవాదులను ప్రోత్సహించే మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఆ రాష్ట్రంలో ఏ అఘాయిత్యం జరిగినా దానికి సైనికులే కారణం అంటూ మొదలవుతున్న ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి. గత నెల హంద్వారాలో జరిగిన ఓ అత్యాచార యత్నానికి సైన్యమే కారణమంటూ చెలరేగిన నిరసనల్లో ఐదుగురు అమాయకులు బలయ్యారు. రానురానూ సంక్లిష్టంగా మారుతున్న అక్కడి పరిస్థితిని అంచనా వేయడంలోనూ, దానికి అనుగుణంగా వ్యవహరించడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు భారతదేశం పట్ల అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకూ, తీవ్రవాదపు విషకోరల నుంచి అక్కడి పౌరులను తప్పించేందుకు ఎవరూ పూనుకున్నట్లు తోచడం లేదు. ఎవరి రాజకీయాలలో వారు నిమగ్నమైపోయి ఉంటే, కశ్మీరం కల్లోలంగా మిగిలిపోవడంలో ఆశ్చర్యం ఏముంది!