కన్నుమూసిన తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి

జయలలిత రూపంలో ఒక రాజకీయ యోధురాల్ని కోల్పోయిన తమిళనాడు మరోసారి శోకసంధ్రమైంది! డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. 94 ఏళ్ల ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు డాక్టర్ల సకల ప్రయత్నాల తరువాత కూడా తుదిశ్వాస విడిచేశారు. కలైంగర్ మృతి చెందారని తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు కావేరి ఆసుపత్రి వద్ద భారీగా గుమికూడారు.

 

 

కరుణానిధి మరణంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చేన్నైలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. కరుణానిధి భౌతికకాయాన్ని మొదట గోపాలపురంలోని ఆయన స్వగృహానికి తరలిస్తారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేశాక ప్రజలు చివరిసారి తమ ప్రియతమ నాయకుడ్ని చూసుకునేందుకు చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది.