కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం

 

చాలా రోజులుగా ఎదురు దెబ్బలే తప్పసానుకూలమయిన పరిస్థితులేవీ కనుచూపుమేర కనబడక దిగాలుపడిఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాదించడం చాలా ఊరటనివ్వడమే కాకుండా కొండంత బలం కూడా ఇచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్నపుడే ప్రతిపక్షాలను పూచికపుల్లతో సమానంగా తీసిపారేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కర్ణాటకలో ఘనవిజయం సాదించిన తరువాత మరింత హీనంగా తీసిపారేస్తుంది.

 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రభుత్వ వ్యతిరేఖ ఓటువల్ల వచ్చిందే తప్ప, కాంగ్రెస్ గొప్పతనం చూసి వేసిందికాదు. ప్రజలకి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో తమకు ఓటు వేసి గెలిపించారని కాంగ్రెస్ పార్టీకి కూడా స్పష్టంగా తెలిసినప్పటికీ, ప్రజలు తమ సమర్ధమయిన, స్వచ్చమయిన పాలన, ప్రజాసంక్షేమ పధకాలను చూసి మెచ్చుకొని, నచ్చుకొన్నారని తనను తానూ మభ్య పెట్టుకొంటూ, ప్రజలను, అటు బీజేపీని కూడా మభ్య పెట్టాలని తప్పక ప్రయత్నిస్తుంది. బీజేపీకి కూడా ఆ సంగతి స్పష్టంగా తెలిసినప్పటికీ తేలుకుట్టిన దొంగలా కాంగ్రెస్ దెబ్బలను మౌనంగా భరించక తప్పదు.

 

ఇంతవరకు బీజేపీ పార్లమెంటులో కాంగ్రెస్ కి చెందిన కళంకిత మంత్రులను తొలగించాలని గట్టిగా వాదిస్తున్నపటికీ, కర్ణాటకలో ఎదురయిన పరాజయంతో ఆ పార్టీ కొంచెం జోరు తగ్గించవచ్చును. అప్పుడు విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఎదురుదాడి మొదలు పెట్టవచ్చును. ఇక, ప్రజాకోర్టులో తాము నేగ్గేము గనుక అదే తమ నీతి నిజాయితీలకి గీటు రాయని నమ్మబలుకుతూ ఇక ప్రతిపక్షాల విమర్శలను, రాజీనామా డిమాండ్ లను, సుప్రీం కోర్టు మొట్టి కాయలను కూడా కాంగ్రెస్ ఖాతరు చేయకపోవచ్చును.

 

ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే, వరుసగా మూడు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించి ఓటమి చవిచూసిన ఆయనకి ఈ విజయం చాలా ఊరటనిస్తుంది. ఆయన తెలివితేటలు, వ్యూహ రచనల వలననే కాంగ్రెస్ ఇంత ఘనవిజయం సాదించిందని, నేటి నుండి పార్టీలో ఆయన భజన మొదలయిపోతుంది. అయితే, ఎన్నికల గంట మ్రోగక ముందు నుండే కర్ణాటకలో పరిస్థితులు బీజేపీకి వ్యతిరేఖంగా, కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమయిన సంకేతాలున్నందున, ఈ విజయంలో రాహుల్ గాంధీ పాత్ర కేవలం నిమ్మితమాత్రమయినదని చెపితే ఆయన భజనదళ సభ్యులకు ఆగ్రహం కలుగవచ్చును. ఏమయినప్పటికీ, ఈ ఎన్నికలలో విజయం వలన రాహుల్ గాంధీలో ఆత్మస్థయిర్యం తప్పక పెరుగుతుంది.

 

ఇక, ఈ ఎన్నికల విజయంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త ఉత్సాహం ఏర్పడవచ్చును. అయితే, ఈ ఘనకీర్తిని తమ ఖాతాలో వేసుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి తదితరులు పోటీపడవచ్చును. ఇప్పటికే మంత్రి రామచంద్రయ్య “చిరంజీవి ముఖ్యమంత్రి పదవికి అర్హుడని చెప్పడానికి ఇంతకంటే ఏమి రుజువు కావలి?” అని అడగడం ఒక చిన్న ఉదాహరణ. ఇటువంటి మాటల యుద్ధాలు మరింత పెరగవచ్చును.