రాజకీయ పార్టీల చేతిలో ప్రజల ఓటమి

 

కర్ణాటకలో జరగనున్న ఎన్నికలపై ఈ సారి కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకొంది. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. కేంద్రంలో తాను సాదించిన ఘన విజయాలేవీ చెప్పుకోవడానికి లేకపోవడంతో, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ తవ్విపోసిన అవినీతి గనులే తమకు అధికారం సాధించి పెడతాయని కాంగ్రెస్ ధృడంగా నమ్ముతోంది. గమ్మతయిన విషయం ఏమిటంటే, కర్ణాటకలో అవినీతికి మారుపేరుగా నిలిచిన బీజేపీ కూడా, దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి భాగోతాలనే ఆధారంగా చేసుకొని ఈ ఎన్నికల గండం గట్టెక్కాలని భావిస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీ ఎడ్యురప్ప, గాలి సోదరులు, వారి అవినీతి గనుల గురించి కధలు కధలుగా ఓటర్లకు వర్ణించి చెప్పి, అటువంటి వారి నుండి రాష్ట్రానికి విముక్తం కలిగించి స్వచ్చమయిన పరిపాలన అందిస్తామని వాగ్దానాలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకత్వంలో యుపీయే ప్రభుత్వంలో బయటపడిన కుంభకోణాలన్నిటినీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ జాడ్యం రాష్ట్రానికి కూడా పాకుతుందని అందువల్ల తమకే ఓటేయమని బీజేపీ కోరుతోంది.

 

ఇక, రాష్ట్రంలో అవినీతికి పెద్దన్నవంటి ఎడ్యురప్ప బీజేపీ తనను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుండి దింపేసినందుకు అలిగి ఆ పార్టీ నుండి వీడిపోయి కర్ణాటక జనతా పార్టీ అనే వేరు కుంపటి పెట్టుకొన్నారు. చివరికి ఆయన కూడా బీజేపీ, కాంగ్రెస్ అవినీతినే తన ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రచారం సాగించడం విశేషం. రెండు నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయినా కూడా ఈ ఎన్నికలలో తన గెలుపు తధ్యమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.

 

 

అవినీతి కూపంలో ఈదులాడుతున్న ఈ మూడు పార్టీలను ప్రజలు అసహ్యించుకొంటున్నారనే సంగతి గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తన జేడీయస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్, బీజేపీల అవినీతి భాగోతాల గురించి ప్రస్తావిస్తూనే, తను అధికారంలో ఉన్నపుడు సాదించిన ఘన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి ఓటర్లకి వివరిస్తూ ఆ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయమయిన తన పార్టీకే ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కానీ, గతంలో మాదిరిగానే ఈ సారి కూడా కాంగ్రెస్, బీజేపీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన కోటీశ్వరులయిన అభ్యర్ధులు డబ్బుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నందున, జేడీయస్ కి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అదే విధంగా రాష్ట్రంలో బలమయిన లింగాయాత్, ఒకలిగ కులాల ప్రభావం కూడా అభ్యర్దుల జాతకాలను నిర్ణయిస్తుంది.

 

అందువల్ల కుమార స్వామి ఎన్నికలలో గెలిచేందుకు తన ప్రయత్నాలు తను చేస్తూనే, తెర వెనుక నుండి బీజేపీ అందిస్తున్న స్నేహ హస్తాన్ని అందుకొన్నారు. రాష్ట్రంలో ఈసారి తన ఓటమి ఖాయమని గ్రహించిన బీజేపీ, జేడీయస్ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ తరువాత ఆ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని గ్రహించడంతో, కుమార్ స్వామితో చేతులు కలిపి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వమయిన ఏర్పరచాలనే ఆలోచనతో ఆయనను దువ్వుతూ తెర వెనుక సంప్రదింపులు మొదలుపెట్టింది.

 

అంటే, ఇప్పుడు కర్ణాటక ప్రజలు ఏ పార్టీని తిరస్కరించి మరే పార్టీని ఎన్నుకొన్నా కూడా వారికి మళ్ళీ ఆ అవినీతి ప్రభుత్వాలే ఏర్పడటం ఖాయమన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ఎన్నికలలో రాజకీయపార్టీలు గెలిస్తే, వారికి ఓటేసి గెలిపించిన ప్రజలు ఓడిపోతారన్నమాట. అయితే వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు కూడా.