వారం రోజుల వర్షాలకే కాళేశ్వరం ఎత్తిపోయింది!

posted on: Jul 15, 2022 10:13AM

ఇంజనీరింగ్ అద్బుతంగా, టీఆర్ఎస్ ప్రభుత్వ ఘన విజయంగా కేసీఆర్ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న కాళేశ్వరం బండారం భారీ వర్షాలకు బట్టబయలైంది. చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం అవినీతి మయం అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎమ్ అంటూ దుయ్యబడుతూనే ఉన్నారు. ఆ విమర్శలను, ఆరోపణలనూ ఇంత కాలం ఖండిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇటీవలి వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయి నీటిని ఎత్తిపోయడానికి వీల్లేనంతగా ధ్వంసమవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది.

చాలా కాలంగా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరు చెప్పి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తూ వస్తున్న విపక్షాలు ఇప్పుుడు వారి విమర్శలకు మరింత పదును పెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కేసీఆర్ అవినీతిని బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునిగిపోయి మరో మూడు నాలుగేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం మునకకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతే కారణమని ధ్వజమెత్తారు. వరద ముంపులో బాధితులు అష్టకష్టాలూ పడుతున్నా రాష్ట్రం వారికి సహాయ సహకారాలందించే విషయంలో మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు.

కాంగ్రెస్ శ్రేణుులు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం మీడియాలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైందనీ, బాధితులను ఆదుకునేందుకు వెంటనే తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలనీ డిమాండ్ చేశారు. వరద ప్రబావిత ప్రాంతాలలో తాను ఈ నెల 17న పర్యటిస్తానని రేవంత్ చెప్పారు.

అంతకు ముందు రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ దేశాన్ని మతాలు, కులాల వారీగా విభజించి విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు 3600 కిలోమీటర్లు సాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు వెళుతుందన్నారు.

రాహుల్ యాత్రను తెలంగాణలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని రేవంత్ అన్నారు.  కేసీఆర్ ను విమర్శిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు ఆగ్రహం వస్తోందో ప్రజలు గ్రహించాలన్నారు. ఆ రెండూ పార్టీలూ కలిసే రాజకీయ డ్రామాలాడుతున్నాయన్నారు. బండి సంజయ్ కార్యక్రమం పెట్టుకున్న సమయంలోనే రేవంత్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడమేమిటని బండి సంజయ్ విమర్శించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలంగా ఉందనీ, ఎవరి కోసమే కాంగ్రెస్ తన కార్యాచరణను ఆపదని స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...