వైఎస్సార్ పేరుకు మంగళం.. శుభం...



ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక మంగళకరమైన ఆలోచన జరుగుతోంది. అది కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలనేది. ఇటీవల జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులో దీనికి సంబంధించిన చర్చ జరిగింది.  ఈ చర్చ అనంతరం కడప జిల్లాకు వున్న వైఎస్సార్ పేరును తొలగించాలనే తీర్మానాన్ని ఆమోదించారు. మినీ మహానాడులో ఆమోదించిన ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించవచ్చు.. లేక ఆమోదించకపోనూ వచ్చు. అయినప్పటికీ, కడప జిల్లా పేరులోంచి వైఎస్సార్ పేరుకు మంగళం పలకడం అనేది ఒక మంగళకరమైన ఆలోచన.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు నిరంకుశంగా పరిపాలించిన సమయంలో తీసుకున్న అనేక అనవసర నిర్ణయాలలో ఒకటి కడప జిల్లాకు వైస్సార్ పేరు అతికించి ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేరును మార్చడం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయిపోయిన కాంగ్రెస్ నాయకులు జిల్లాల పేర్ల మార్పు తమ జన్మహక్కు అన్నట్టుగా కడప జిల్లా పేరుకు వైఎస్సార్ పేరును అతికించారు. కడప జిల్లాలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. కడప జిల్లాకు ఎంతో సేవ చేసిన గొప్పవారు వున్నారు. వారెవరి పేరునూ ఈ జిల్లాకు పెట్టాలన్న ఆలోచన రాని కాంగ్రెస్ నాయకులకు వైఎస్సార్ చనిపోగానే ఆయన పేరును పెట్టేశారు. ఈ అంశం మీద అప్పట్లోనే వివాదం చెలరేగింది.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాను ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని చాంతాడంత పొడవుగా మార్చినప్పటికీ జనం మాత్రం చక్కగా ‘కడప జిల్లా’ అంటూ పాత పేరునే ఉపయోగిస్తూ వస్తున్నారు. మీడియాలో కూడా ‘కడప జిల్లా’ అంటూ వస్తోంది. ఒక్క జగన్ మీడియా మాత్రం ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేర్కొంటూ వస్తోంది. ‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’ అనే పేరును ఉపయోగించినట్టుగా కడప జిల్లా విషయంలో జరగలేదు. అంటే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టడం జనానికి కూడా ఇష్టం లేదని స్పష్టమవుతోంది. పైగా ముఖ్యమంత్రిగా పనిచేయడమే జిల్లాకు పేరు పెట్టడానికి అర్హత కాదు. అదే అర్హత అయితే ఏ జిల్లాకి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే  ఆ జిల్లాకు ఆయన పేరు పెట్టేస్తారా? ఈ నేపథ్యంలో కడప జిల్లాకు వైఎస్సార్ పేరును తొలగించాలన్న ఆలోచనలు రావడం శుభప్రదం.