TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జడ్జీల నియమాకాల్లో 'న్యాయం' ఎంత?

Published on: Sat Sep 3, 2016 3:37PM


మన దేశంలో ప్రభుత్వం, పార్లమెంట్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారగణం... ఇవన్నీ ఒక ఎత్తు... కోర్టు, జడ్జీలు ఒక ఎత్తు! ఇప్పటికీ జనం మరెక్కడా న్యాయం దొరకకున్నా కోర్టులో దొరుకుతుందని బలంగా నమ్ముతారు! అందుకే, పొలం గట్ల తగాదాల నుంచీ అయోధ్య రామమందిరం సమస్య వరకూ అన్నిటికి కోర్టే శరణ్యం అనుకుంటూ వుంటాం. వ్యక్తిగత గొడవలే కాదు దేశాన్ని , దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే అతి పెద్ద , అతి కీలక సమస్యలు కూడా కోర్టుల ముంగిటకు వచ్చి ఆగుతుంటాయి. ఇక అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచే ట్రిపుల్ తలాఖ్ వుండాలా వద్దా, గుళ్లలోకి మహిళలు ప్రవేశించాలా వద్దా, స్వలింగ సంపర్కం వగైరా వగైరా లాంటివి వుండనే వున్నాయి! అసలు ప్రస్తుతం కోర్టులు, జడ్జీలు ప్రభావితం చేయని, చేయలేని రంగమంటూ ఏదీ దేశంలో లేదంటే ఆశ్చర్యమేం లేదు!


దేశ భవిష్యత్తు, దేశ పౌరుల భవిష్యత్తు తమదైన రీతిలో నిర్దేశించే ఉన్నత న్యాయస్థానాల జడ్జీల నియామకం ఈ మధ్య పెద్ద గొడవకే కారణమైంది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి దాకా నడుస్తోన్న జడ్జీల నియామక విధానం మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొలీజియమ్ పద్ధతి అమలులో వుంది. అంటే సుప్రీమ్ చీఫ్ జస్టీస్ తో సహా మరో నలుగురు సీనియర్ జడ్జీలు కొలీజియమ్ గా ఏర్పడి సుప్రీమ్ కోర్టు జడ్జీల్ని, వివిధ హై కోర్ట్ జడ్జీల్ని ఎంపిక చేస్తుంటారు. కాని, దీనికి బదులుగా నేషనల్ జుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎన్డీఏ సర్కార్ యోచించింది. ఇలా చేయటం వల్ల కేవలం అయిదుగురు న్యాయమూర్తులు ఇతర న్యాయమూర్తుల్ని నియమించటం కాకుండా మరింత పారదర్శకంగా జడ్జీల ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం భావించింది.


కొలీజియమ్ వ్యవస్థ రద్దకు సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టీస్ టీఎస్ థాకూర్ ససేమీరా అన్నారు. అలాగే చాలా మంది న్యాయమూర్తులు జడ్జీల ఎంపికలో పారదర్శకతకు మార్గం వేసే ప్రయత్నాలకు అడ్డుతగిలారు. అయితే, తాజాగా సుప్రీమ్ కోర్టులో సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ చలమేశ్వర్ కొలీజియమ్ వ్యవస్థపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన సుప్రీమ్ లో ప్రస్తుతం వున్న కొలీజియమ్ లో మెంబర్ కూడా! అయితే, తనతో పాటూ మరో నలుగురు జడ్జీలు కలిసి చేసే ఇతర జడ్జీల నియామకం అస్సలు పారదర్శకంగా లేదని చలమేశ్వర్ తేల్చేశారు. పేరుకి అయిదుగురు సీనియర్ జడ్జెస్ వున్నా ఇద్దరు మాత్రమే పేర్లు నిర్ణయించుకుని మీటింగ్ కి వస్తారని, వాళ్లకు యెస్ గాని, నోగాని చెప్పటం మాత్రమే మిగతా వారు చేయాల్సి వుంటుందని ఆయన మీడియాతో అన్నారు! ఒకవేళ జడ్జ్ గా ఎంపికైన ఒక వ్యక్తి ఎవరైనా అవినీతిపరుడై వుంటే అతడి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వీలు కూడా కొలీజీయమ్ లో వుండదని చలమేశ్వర్ ఆరోపించారు.


ఇక మీదట కొలీజియమ్ మీటింగ్స్ కి తాను హాజరుకాబోనని సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కి రాత పూర్వకంగా తెలిపిన జస్టిస్ చలమేశ్వర్ ఇంకా అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కొలీజీయమ్ వ్యవస్థలో జడ్జీల ఎంపిక మాత్రమే జరుగుతుంది తప్ప ఎలాంటి చర్చా, ఎలాంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటం లాంటివేవీ వుండవని ఆయన అన్నారు. మొత్తంగా ఎంతో కీలకమైన జడ్జీల నియామకం అత్యంత గోప్యంగా, ఎలాంటి మెరిట్ ఆధారం చేసుకుని జరిపే చర్చా వంటిదేదీ లేకుండానే జరుగుతుందని చలమేశ్వర్ స్పష్టం చేశారు!


జస్టిస్ చలమేశ్వర్ జడ్జీల నియామకానికి కమీషన్ ఏర్పాటును సమర్థించిన ఏకైక సుప్రీమ్ జడ్జ్. ఆయనిప్పుడు ఇలా పబ్లిగ్గా కొలీజియమ్ వ్యవస్థను తప్పుబట్టడం పెద్ద దుమారానికే తెర తీసే అవకాశం వుంది. అయితే, జడ్జీల నియామకంలో పాదర్శకత రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా వుంది.