జోగి రమేష్.. జైలు నుంచి ఇలా బయటకు.. అలా జగన్ చెంతకు!
posted on: Jan 28, 2026 3:01PM

నేర చరిత ఉన్నవారినీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారినీ జగన్ చేరదీస్తారనీ, ప్రోత్సహిస్తారనీ రాజకీయవర్గాలలో ఓ అభిప్రాయం ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా కూడా జగన్ అదే ధోరణి అవలంబిస్తున్నారని పరిశీలకులు ఉదాహరణలు చూపుతూ విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి తాజాగా జరిగింది.
కల్తీ మద్యం తయారీ కేసులో నిందితుడిగా అరెస్టై దాదాపు మూడు నెలలు రిమాండ్ ఖైదీగా ఉండి నాలుగు రోజుల కిందటే వచ్చిన జోగి రమేష్ సోదరులు ఇలా జైలు నుంచి బయటకు వచ్చారో లేదో అలా జగన్ అప్పాయింట్ మెంట్ సంపాదించేసి తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అయ్యారు. గత ఎన్నికలలో ఓటమి తరువాత అడపాదడపా తప్ప ఆంధ్రప్రదేశ్ ముఖం చూడని జగన్ ను వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకులు కలవాలన్నా ఎదురు చూపులు తప్పని పరిస్థితి. అటువంటిది కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, అరెస్టై బెయిలుపై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి మాత్రం జగన్ అప్పాయింట్ మెంట్ సునాయాసంగా దొరికేసింది.
మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం అంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్న గంటల వ్యవధిలో జోగి రమేష్ కుటుంబం ఆయనతో భేటీ అయ్యింది. జగన్ తో జోగి రమేష్ కుటంబ సమేతంగా భేటీ అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. కల్తీ మద్యం తయారీ కేసులో అరెస్టై బెయిలుపై వచ్చిన జోగు రమేష్ కు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ అప్పాయింట్ మెంట్ ఇవ్వడమే విమర్శలకు తావిస్తున్నది. నేర చరిత ఉన్నవారినీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారినీ జగన్ చేరదీస్తారనీ, ప్రోత్సహిస్తారనడానికి ఈ భేటీ తాజా తార్కానంగా నిలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.










