జీసస్ చెప్పిన రెండు కథలు

ప్రపంచ చరిత్రలో క్రీస్తు జీవితం ఓ అసమాన ఘట్టం. తత్వవేత్తగా, దేవుని కుమారుడిగా, విప్లవకారునిగా... ఎవరు ఏ తీరున చూస్తే ఆ తీరుగా కనిపించే జీసస్ ప్రభావం అనంతం. జీసస్ జీవితమే కాదు, ఆయన బోధలు కూడా అసమాన్యంగానే తోస్తాయి. అప్పటి ఛాందసమైన ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడుతూనే ప్రేమ, కరుణ వంటి మానవ విలువలను బోధించారు. వాటివల్ల తన ప్రాణాలకు హాని ఉంటుందని తెలిసినా కూడా తను అనుకున్నది ప్రవచించారు. సందర్భాన్ని బట్టి క్రీస్తు బోధలు ఒకోసారి తీక్షణంగా ఉంటే, మరోసారి మృదువుగా సాగుతాయి. తాను చెప్పదల్చుకున్న విషయం శిష్యులకు అందించేందుకు ఒకోసారి నీతికథల ద్వారా కూడా బోధించేవారు. అలా ప్రేమ, క్షమాపణల గురించి క్రీస్తు చెప్పిన కథలలో రెండు ప్రముఖమైనవి ఇవిగో...

 

గుడ్ సమారిటన్ (Parable of the Good Samaritan)
ఇతరుకు సాయపడే గుణం ఉన్నవారిని మనం ‘గుడ్ సమారిటన్’ అంటాం. ఆ పదానికి మూలం క్రీస్తు బోధలలో ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. పొరుగువాడితో ఎలా ఉండాలి అని ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకుగాను క్రీస్తు చెప్పిన కథలో సమారిటన్ (ఓ స్థానిక తెగ) అనే మాట వినిపిస్తుంది. ‘‘ఒక వ్యక్తి జెరుసలేం నుంచి జెరికో అనే ఊరికి ప్రయాణిస్తున్నాడు. ఇంతలో దొంగలు అతడిని నిలువుదోపిడీ చేసి, కొనప్రాణాలతో ఉండేదాకా కొట్టి వెళ్లిపోయారు. ఆ దారినే ఒక పూజారి వెళ్లడం తటస్థించింది. కానీ అతను దారిపక్కన పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండానే సాగిపోయాడు. మరో వ్యక్తి కూడా ఏమీ ఎరగనట్లే ఆ దోవ వెంట పడి ఉన్న వ్యక్తిని చూసుకుంటూ వెళ్లిపోయాడు.

 


‘‘ఈలోగా అక్కడికి వచ్చిన ఓ సమారిటన్ మాత్రం, కొన ఊపిరితో పడి ఉన్న మనిషిని చూడగానే కదిలిపోయాడు. అతని గాయాలకు కట్టుకట్టి నూనె రాసి, ద్రాక్షరసాన్ని అందించాడు. తనతోపాటు అతన్ని కూడా ఓ సత్రానికి తీసుకువెళ్లి బాగోగులను గమనించుకున్నాడు. మర్నాడు తన దారిన తను వెళ్తూ సత్రపు యజమాని చేతిలో ఓ రెండు దీనార్లని ఉంచి, అతను కోలుకునేదాకా సేవ చేయమని అర్ధించాడు. ఆ రెండు దీనార్లు చాలకపోయినా ఊరుకోవద్దనీ, అతని కోసం ఎంత ఖర్చయితే అంతా తాను తిరుగు ప్రయాణంలో జమ చేస్తాననీ చెప్పి వెళ్లాడు.’’

 


పై కథ చెప్పిన తరువాత క్రీస్తు – ‘‘దొంగల బారిన పడ్డ ఆ మనిషికి తోడుగా ఎలాంటి స్వభావం ఉన్న మనిషి పొరుగువాడిగా ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు!’’ అని తన శిష్యుని అడిగాడు. దానికి శిష్యుడు తడుముకోకుండా- ‘‘అతనికి సాయం చేసిన సమారిటన్లాంటి మనిషి పొరుగువాడిగా ఉంటే బాగుంటుంది,’’ అని చెప్పాడు. ‘‘అయితే ఇంకే! నువ్వు కూడా ఆ సమారిటన్లాగానే ప్రవర్తిస్తూ ఉండు,’’ అని సూచించారు జీసస్.

 

దయలేని నౌకరు కథ (Parable of the Unforgiving Servant)
‘‘ప్రభూ! నా సోదరుడు చేసిన తప్పులను నేను ఎన్నిసార్లు క్షమించాలి. ఏడుసార్లు క్షమిస్తే సరిపోతుందా?’’ అని జీసస్ను అడిగాడు ఓ శిష్యుడు. దానికి క్రీస్తు ‘‘ఏడు సార్లు కాదు ఏడు రెట్లు డెబ్భైసార్లు క్షమించినా తప్పులేదు,’’ అంటూ ఈ కథని చెప్పుకొచ్చారు. ‘‘ఓ సేవకుడు తన రాజుగారి దగ్గర కోట్ల దీనార్లు అప్పు చేశాడు. ఆ అప్పుని ఎంతకీ తీర్చకపోవడంతో రాజుగారు ఆగ్రహించారు. సేవకుడి కుటుంబంతో సహా అతని ఆస్తి యావత్తునీ వేలం వేసి, అతని నుంచి రుణాన్ని వసూలు చేసుకోమని ఆజ్ఞాపించారు. ఆ మాటలకు సేవకుడు వణికిపోయాడు. తన మీద దయ చూపమనీ, ఎలాగొలా ఆ రుణాన్ని తీరుస్తాననీ... రాజుగారి కాళ్లముందు పడి వేడుకున్నాడు. సేవకుడి వేడుకోళ్లకు రాజుగారు కరిగిపోయారు. సేవకుడిని క్షమించి అతని రుణాన్ని మాఫీ చేశారు.

 


‘‘ఆ సేవకుడు సంతోషంగా ఇంటికి తిరిగివెళ్తుండగా అతనికి తన దగ్గర వంద దీనార్లు అప్పు చేసిన ఓ చిరు గుమాస్తా కనిపించాడు. వెంటనే అతని గొంతు పట్టుకుని తన బాకీ తిరిగి కట్టమంటూ దబాయించాడు సేవకుడు. తన మీద దయచూపమనీ, త్వరలోనే వంద దీనార్ల బాకీని తీరుస్తాననీ ఆ మనిషి ఎంతగా మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. తన బాకీ తీరేదాకా అతడు శిక్ష అనుభవించాల్సిందే అంటూ అతడిని ఖైదు చేయించాడు సేవకుడు. ఈ విషయం రాజుగారి చెవిన పడగానే ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. వెంటనే సేవకుడిని పిలిపించి- ‘నేను నీ మీద దయతలిచి నీ రుణాన్ని మాఫీ చేశాను. నువ్వు కూడా అలాగే చేసి ఉండాల్సింది కదా! నువ్వు కూడా నాలాగే కరుణ చూపించి ఉండాల్సింది కదా!’ అంటూ అతను తన వద్ద బాకీ పడ్డ కోట్లాది దీనార్లని తిరిగి చెల్లించేదాకా చిత్రహింసలను అనుభవించాలని ఆదేశించారు.’’

 


‘మనం చేసే ఘోరపాపాలెన్నింటినో ఆ భగవంతుడు క్షమించేస్తాడు. అలాంటిది మన తోటివాడు చిన్నచిన్న తప్పులు చేస్తే క్షమించలేమా’ అన్నది జీసస్ అభిప్రాయమని ఈ కథ సూచిస్తోంది.

 

- నిర్జర.