జెండాపై కపిరాజు సినిమా రివ్యూ

 

మళ్ళీ చాలా రోజుల తరువాత నాని జెండాపై కపిరాజుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేడు. నాని తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. కానీ ఏదో చాలాసార్లు చేసినట్లు చాలా అలవోకగా రెండు పాత్రలను ఇరగదీసేసాడు. రెండు పాత్రలలో ఒకటి డీసెంటుగా ఉండే ఐ.టి. ప్రొఫెషనల్, మరొకటి దానికి పూర్తి భిన్నంగా ఉండే మోసగాడి పాత్ర. తమిళ్, తెలుగు బాషలలో ఒకేసారి నిర్మింపబడిన ఈ సినిమాలో తెలుగులో నాని, తమిళ్ (నిమ్రిందు నిల్)లో జయం రవి చేసారు. రెండూ ఒకేసారి నిర్మించబడినప్పటికీ ముందుగా (క్రిందటి నెలలో) విడుదలయిన తమిళ వెర్షన్ సూపర్ హిట్ అయ్యింది. కనుక తెలుగులో కూడా రిలీజ్ కాకముందే హిట్ టాక్ మూటగట్టుకొని మరీ వచ్చింది. మరి హిట్టా ఫట్టా ఒకసారి లుక్కేద్దామా?

 

ఇంతకీ కధ ఏమిటంటే నాని ఒక ఐ.టి.ప్రొఫెషనల్. తన చుట్టూ ఉండే సమాజంలో అందరూ పద్ధతి ప్రకారం నడుచుకోవాలనుకొంటాడు. నీతి నియమం, న్యాయం ధర్మం అవసరమని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో కొంత ఘర్షణ ఎదుర్కోవలసి వస్తుంటుంది. ఈ లైన్ వినగానే టక్కున అందరికీ ‘అపరిచితుడు’ సినిమా గుర్తుకు రావచ్చును. కాకపోతే ఈ కధ వాస్తవానికి దగ్గరగా సహజంగా ఉంటుంది. దానిని నాని తన స్టయిల్లో చాలా చక్కగా ప్రెజంట్ చేసాడు. ప్రతీ వ్యక్తి ముందు తనను తాను సంస్కరించుకొంటే సమాజంలో కూడా మార్పు వస్తుందనేది సినిమా కాన్సెప్ట్.

 

నానితో హీరోయిన్ గా నటించిన అమలాపౌల్ చాలా చక్కగా నటించి ఈ సినిమా ద్వారా తన ప్రతిభను మరొకసారి చాటుకొంది. మరో హీరోయిన్ రాగిణీ ద్వేవేది కూడా బాగానే చేసింది. కానీ ఆమె అందాల ప్రదర్శనకే సరిపెట్టుకోవలసి వచ్చింది. తనికెళ్ళ భరణి, ఆహుతీ ప్రసాద్, వెన్నెల కిషోర్, శరత్ బాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. సూరి, శివ బాలాజీ, ధన్ రాజ్ తదితరులు కూడా బాగానే నటించారు. ఈసినిమా ఫాస్ట్ ఆఫ్ చాలా వేగంగా సాగినప్పటికీ, సెకండ్ ఆఫ్ వచ్చేసరికి కొంచెం స్పీడ్ తగ్గింది. పైగా సినిమాకి మసాలా జోడించే ప్రయత్నంలో అనవసరమయిన చోట పాటలు, ఫైట్లు పెట్టారు. కానీ నానీ తన స్టయిల్ తో ఆ లోపాలనన్నిటినీ కనబడకుండా మాయచేయడంతో ప్రేక్షకులకు ఎక్కడా విసుగనిపించదు. ఈ సినిమాలో లోపాలను కొంచెం పక్కనబెడితే ఇది తప్పకుండా చూడదగ్గ సినిమాయే.

 

నిర్మాతలు: కె.యస్. శ్రీనివాసన్ మరియు కె.యన్. శివరామ్; బ్యానర్: వాసన్ విజువల్స్ వెంచర్స్, కధ, దర్శకత్వం: సముద్రఖని, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, కెమెరా: యమ్. సుకుమార్ ఎడిటింగ్: యస్.యాన్. ఫాజిల్,