విడుదలై 24 గంటల గడవకముందే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

ఊహించినట్లే జరిగింది. జైలు నుంచి విడుద‌లై 24 గంట‌లు తిర‌గ‌క ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు.

 

54 రోజుల పాటు కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న బెయిల్‌ పై విడుదలయ్యారు. అయితే, కడప జైలు నుంచి విడుదలై తాడిపత్రి వచ్చే క్రమంలో భారీ కారు ర్యాలీతో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కారు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ విరుచుకుపడ్డారు.

 

దాంతో సీఐ దేవేంద్ర కుమార్ తాడిపత్రిలో ఫిర్యాదు చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా కేసు నమోదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను గుత్తి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చుతారని తెలుస్తోంది.