జయ ఇక లేరు. కానీ...

నిండైన విగ్రహం. ఆకుపచ్చని ఆహార్యం! ఆమె అడుగుపెట్టగానే పాదాభివందనం చేసే మంత్రులు. అమ్మ అంటూ గుండె గుడిలో ఆమెను ఆరాధించే జనం. ఈ రెండు వాక్యాలూ చాలు... అవి ఎవరో తెలిసిపోవడానికి. తమిళనాట ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరొందిన ఆ ధీశాలి ఇక లేరని తెలిశాక తమిళనాడు ఒక్క క్షణం స్తంభించిపోయింది. జీవితానికి తనదైన అరుదైన నిర్వచనం ఇచ్చిన ఆ మూర్తి మృత్యువుతో ఒక శకం ముగిసిపోయింది.

 

ఈ రోజున జయలలిత కోసం కోట్ల మంది కన్నీరు విడుస్తుండవచ్చు, రాచమర్యాదలకు తీసిపోని ప్రభుత్వ లాంఛనాలు ఆమె చుట్టూ ఉండవచ్చు. కానీ ఇంతదూరం వచ్చేందుకు ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. జయలలిత పేరుకి మాత్రమే ఒక ఉన్నత కుటుంబంలోనే పుట్టారు. కానీ ఆమె తండ్రి జయరాం వ్యసనాలకు లోనుకావడంతో, కొండంత ఆస్తి కాస్తా హారతి కర్పూరంలా హరించుకుపోయింది. జయలలితకు రెండేళ్ల వయసు ఉండగానే, జయరాం చనిపోవడంతో ఉన్న ఆ అరకొర ఆసరా కూడా ఆ కుటుంబానికి దూరమైంది.

 

భర్త దూరం కావడంతో జయలలిత తల్లి వేదవల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. తన ఇద్దరు పిల్లలను సంరక్షించుకునేందుకు ఆమె బెంగళూరులో చిన్నాచితకా పనులు చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత కాలంలో మద్రాసులో పనిచేస్తున్న అంబుజవల్లి దగ్గరకి చేరుకోవడంతో జయలలిత కుటుంబానికి ఒక స్థిరత్వం వచ్చినట్లయ్యింది. అంబుజవల్లి ద్వారానే వేదవల్లి తన పేరుని సంధ్యగా మార్చుకుని సినిమాలలో చిన్నచిన్న పాత్రలు ధరించడం మొదలుపెట్టింది.

 

తల్లి సినిమాలలో నటిస్తున్నప్పటికీ జయలలితకు ఆ రంగం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. శివాజీ గణేశన్ అంతటివాడు ఆమె అందాన్నీ, నాట్యాన్నీ చూసి ‘గొప్ప నటి అవుతుందని’ ప్రశంసించినా.... ఒక న్యాయవాదిగా స్థిరపడాలన్నదే జయలలిత లక్ష్యంగా ఉండేది. కానీ విధితీరు మరోలా సాగింది. జయలలితకు 15 ఏళ్లు ఉండగా ఆమెను బి.ఆర్.పంతులు ఆనే కన్నడ దర్శకుడు గమనించాడు. ఎలాగూ కాలేజిలో చేరేందుకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి, ఆ విరామసమయంలో తన రాబోయే చిత్రంలో నటించమని అడిగాడు. అలా జయలలిత ‘చిన్నడ గొంబె’ అనే కన్నడచిత్రంలో నటించింది. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఇక ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు.

 

జయ జీవితంలోని తరువాత భాగమంతా ఇక చరిత్రే! ఎం.జి.ఆర్ స్ఫూర్తితో అన్నాడీఎంకేలోకి ప్రవేశించిన జయ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆంగ్లంలో ఆమె వాగ్ధాటిని గమనించిన ఎం.జి.ఆర్ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే 1987లో ఎం.జి.ఆర్ మరణించడంతో ఆయన వారసురాలిగా నిరూపించుకునేందుకు జయ తనదైన రాజకీయాలు మొదలుపెట్టారు. తమిళనాట రాజకీయాలు ఏమంత సులువు కావు! అక్కడి ప్రజల్లో భావోద్వేగాలు, నేతలలో వ్యూహప్రతివ్యూహాలు తారస్థాయిలో సాగుతుంటాయి. జాతీయ పార్టీలతో పాటుగా స్థానిక పార్టీల జోరూ అప్రతిహతంగానే ఉంటుంది.

 

1989లో జయలలిత ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టిన సంవత్సరంలో అక్కడి రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసొచ్చింది. ఆ ఏడాది ఆమెను నిండు శాసనసభలో ఆమె చీరను చింపి అవమానించారు. ఒక ఆడది, అందులోనూ ఎం.జి.ఆర్తో సహజీవనం చేసి ఆయన వారసురాలిగా అడుగుపెట్టిన మనిషి... తమను ఏం చేయలేదన్న ధీమాతో కరుణానిధి ఆ పర్వాన్ని చిరునవ్వుతో పరికించారని అంటారు. కానీ రెండేళ్లు తిరిగేసరికి అదే శాసనసభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడంతో ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందనీ... దానికి ఎదుర్కోవడం అంత సులభం కాదనీ తెలిసొచ్చింది.

 

ముఖ్యమంత్రిగానూ జయలలితకు ఒక శైలి ఉంది. పేదలకి మేలు చేసేందుకో, ప్రజల అభిమానాన్ని సంపాదించుకునేందుకో... కారణం ఏదైనాగానీ విరివిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేవారు. పసిపిల్లలు, పేదవారు, స్త్రీల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలు బడుగువర్గాలలో ఆమెకు మంచి ఆదరణని కలిగించాయి. ఇప్పటికీ చెన్నైలోని మురికివాడల పక్క నుంచి వెళ్లేవారికి అక్కడి గుడిసెలలో ఆమె ఫొటోలు కనిపిస్తాయి. ఇదే సమయంలో కొన్ని దూకుడు నిర్ణయాల వల్ల ఆమె కఠినమైన అధినేత్రిగా కూడా పేరొందారు. 2003లో ప్రభుత్వోద్యోగులు మెరుపుసమ్మెకు దిగినప్పుడు, 1.7 లక్షలమంది ఉద్యోగులను డిస్మిస్ చేసిపారేసిన జయ చర్యకు జనం ముక్కున వేలేసుకున్నారు.

 

తన చిరకాల ప్రత్యర్థి కరుణానిధిని అరెస్టు చేయించడం, కంచి పీఠీధిపతి జయేంద్ర సరస్వతిని కటకటాల వెనక్కి నెట్టడం వంటి చర్యలతో ఆమె దూకుడుకి అడ్డులేదని తేలిపోయింది. కానీ జయ నివాసంలో లెక్కకు మిక్కిలిగా ఆస్తులు బయటపడటం, టాన్సీ భూముల కుంభకోణం, ప్లజంట్ స్టే హోటల్ కేసు, కలర్ టీవీల కుంభకోణం.. ఇలా నానారకాల కుంభకోణాలలో జయ పీకల్లోతు మునిగిపోయారు. ఈ కేసుల కారణంగానే పదవి నుంచి దిగాల్సి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. వీటికి తోడు విలాసవంతమైన ఆమె జీవితం, పార్టీలో నియంతృత్వ పోకడలు కూడా జయ వ్యక్తిత్వంలో భాగమైపోయాయి.

 

మంచిచెడులు ఎలా ఉన్నా ప్రస్తుతం తమిళనాట జయలలితే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అనడంలో అనుమానం లేదు. అందుకే 32 ఏళ్ల తరువాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని తమిళతంబిలు ఆమెకు కల్పించారు. మరో పక్క ఆమె మీద ఉన్న కేసులు ఒకొక్కటిగా విడిపోతున్నాయి. ఈ ఏడాది మే నెలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన జయ- అమ్మ క్యాంటీన్, అమ్మ ఉప్పు, అమ్మ మందులు అంటూ తనదైన శైలిలో సంక్షేమానికి దారితీశారు. ఈలోపులే ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇదేదో తాత్కాలికమైన ఆరోగ్య సమస్యే అని సరిపెట్టుకున్ని తమిళ ప్రజలు, నెలలు గడిచినా కూడా జయ ఆసుపత్రికే పరిమితం కావడం చూసి విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యారు. ఎలాగొలా తిరిగి జయ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ యజ్ఞయాగాలు నిర్వహించారు.

 

ప్రజల ఆకాంక్షలు ఫలించాయా అన్నట్లుగా నవంబరునాటికి జయ కోలుకుంటున్న వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆమె చిరునవ్వుని తిరిగి చూస్తామని ఆశించిన తమిళ ప్రజలకి శరాఘాతంగా ఆమెకి గుండెపోటు వచ్చిందన్న వార్త వినిపించింది. ఒక పక్క జయ ప్రత్యర్థి కరుణానిధి వయసు మీరిపోవడంతో... జయ తప్ప అన్యమెరుగని తమిళప్రజలకు ఆమె ఇక లేదన్న వార్త నిజంగా పిడుగుపాటే! కేవలం తమిళ ప్రజలకే కాదు యావద్భారతానికీ కూడా జయ లేని లోటు ఒక వేటుగానే మిగిలిపోనుంది. రాజకీయాలలో ఆరితేరిన నాయకురాలిగా, విపత్కరమైన పరిస్థితులలో తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు వినిపించే ధీశాలిగా, జాతీయ కూటములలో భాగంగా తన పంతాన్ని నెగ్గించుకునే  సహచరిగా... జయ లేని దేశరాజకీయాలను సైతం ఊహించడం కష్టం.