తలాఖ్ పై తలా ఒక మాట! అయినా, చర్చ జరగటమే ఇప్పుడు కావాల్సింది!

2014లో మోదీ సంపూర్ణ మెజార్టీతో ప్రధాని అయ్యారు! అది స్వతంత్ర భారత చరిత్రలో పెద్ద మలుపు! ఇక ఇప్పుడు భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రాన్ని కూడా కాషాయ దళం కాషయం ధరించిన యోగి చేతుల్లో పెట్టింది. ఇది ఇంకా పెద్ద మలుపు. ఈ పరిణామాల వల్ల ముందు ముందు భారీ మార్పులే వస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా, యూనిఫామ్ సివిల్ కోడ్ కు దారితీసే ట్రిపుల్ తలాఖ్ అంశం వేగంగా రూపు మారుతోంది. దశాబ్దాలుగా అందరికీ తెలిసినా, ఎవ్వరూ మాట్లాడని విషాదం… ఇప్పుడు రోజువారీ చర్చా విషయంగా మారిపోయింది! ఎంతగా అంటే , యోగీ ఆదిత్యనాథ్ లాంటి కరుడుగట్టిన హిందూత్వవాదులు మొదలు బాలీవుడ్ పాటల రచయిత జావేద్ అఖ్తర్ వరకూ ఎవ్వరూ ట్రిపుల్ తలాఖ్ పై కామెంట్ చేయకుండా వుండలేకపోతున్నారు! ఇలాంటి చర్చ ఎప్పుడో జరగాల్సి వున్నా… కనీసం ఇప్పుడు జరుగుతున్నందుకు మనం సంతోషించాలి!

 

అసలు మన దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించటమే రెండుగా చీలిపోతూ అయింది. ఇండియా, పాకిస్తాన్ అంటూ రెండు దేశాలు అస్థిత్వంలోకి వచ్చాయి అఖండ భారత్ లోంచి. అయితే, విచిత్రంగా ట్రిపుల్ తలాఖ్ లాంటి నియమం ముస్లిమ్ దేశంగా పుట్టిన పాకిస్తాన్లో ఎప్పుడో పోయింది. ఇక్కడ మాత్రం సెక్యులర్ ముసుగులో కొనసాగూతూనే వుంది. డెబ్బై ఏళ్లు అవుతున్నా ముస్లిమ్ మహిళలందరికీ చేటూ చేసే ఈ దుర్మార్గాన్ని మన నేతలు, మేధావులు, ఉద్యమకారులు ఎవ్వరూ బలంగా వ్యతిరేకించలేదు. సౌదీ అరేబియా లాంటి నిఖార్సైన ఇస్లామిక్ దేశం కూడా వద్దని పక్కన పెట్టిన ట్రిపుల్ తలాఖ్ మనకెందుకని ఎవ్వరూ అడగలేదు. ఇందుకు కారణం, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాలే!

 

ఇప్పుడు చరిత్రలో తొలిసారిగా కాంగ్రేసేతర పార్టీ మోదీ నేతృత్వంలో దేశాన్ని నడుపుతోంది. ఆ ఎఫెక్టే ట్రిపుల్ తలాఖ్ పైన కూడా పడుతోంది. అయితే, బీజేపి హిందూత్వవాద పార్టీ కాబట్టి ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేకించటంలో దాని లెక్కలు దానికుంటాయి. అవన్నీ మనం సమర్థించాల్సిన పని లేదు. కాని, మోదీ, యోగీ లాంటి నాయకులు బహిరంగంగా , బలంగా ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకించటం మాత్రం తప్పక అభినందించాల్సిన పరిణామం. అందువల్ల మహిళల హక్కులకి తీవ్రమైన భంగం కలిగిస్తోన్న ఒకానొక దురాచారంపై చర్చ మొదలైంది.

 

బాలీవుడ్ రచయిత జావేద్ ఆఖ్తర్ తాజాగా ఘాటైన ట్వీట్స్ చేశాడు. ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ ట్రిపుల్ తలాఖ్ రద్దును వ్యతిరేకిస్తూ విచిత్రమైన ప్రతిపాదనలు చేయటం అవివేకం అన్నాడు. పర్సనల్ లా బోర్డ్ ఈ మధ్యే ట్రిపుల్ తలాఖ్ దుర్వినియోగం చేసే వార్ని సామాజిక బహిష్కరణకి గురి చేయాలని నిర్ణయించింది! దీనికి స్సందించిన ఆఖ్తర్, ‘’ ట్రిపుల్ తలాఖ్ ను దుర్వినియోగం చేయటం ఏంటి? లైంగిక వేధింపుల్ని, రేప్ ని ఎవరైనా దుర్వినియోగం చేస్తారా? అసలు అవ్వి చేయటమే దుర్మార్గం! ఇంక దుర్వినియోగం ఏంటి? ‘’ అని సూటిగా ప్రశ్నించాడు. కొన్నాళ్ల క్రితం వరకూ ఇలాంటి బహిరంగ చర్చ మనం అస్సలు ఊహించగలమా? కాని, మారిన ప్రభుత్వాల నేపథ్యంలో గొంతుకలు కూడా మారుతున్నాయి!

 

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ అయితే …. ట్రిపుల్ తలాఖ్ ద్రౌపతీ వస్త్రాపహరణం లాంటిదన్నారు! దీనిపై సహజంగానే కాంగ్రెస్, ఇతర బీజేపి వ్యతిరేక పార్టీలు గొడవ చేస్తున్నప్పటికీ… ఆయన అసలు ఉద్దేశం ఇక్కడ చాలా ముఖ్యం. ద్రౌపతి వస్త్రాపహరణం చేసిన వారిది ఎంత నేరమో, అంతే నేరం ఆ సమయంలో మౌనంగా వున్న వారిది కూడా! ట్రిపుల్ తలాఖ్ కూడా దశబ్దాలుగా ముస్లిమ్ మహిళల జీవితాలు నాశనం చేస్తుంటే పాలకులు, మేధావులు, ఉద్యమకారులు మౌనంగా వుండటం ఎలా భావించాలి? ఇప్పటికైనా శుభ సూచకంగా ట్రిపుల్ తలాఖ్ పై చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఇలాగే అన్ని మతాల్లోని , అన్ని దురాచారాలపైనా చర్చ జరగాల్సిందే. అదే ప్రజాస్వామ్య లక్షణం! ఇక ట్రిపుల్ తలాఖ్ పైన ఎవరి అభిప్రాయం ఎలా వున్నా సుప్రీమ్ కోర్టుదే అంతిమ నిర్ణయం! అది కూడా సాధ్యమైనంత త్వరలోనే వెలువడాలని ఆశిద్దాం…