పవన్ అభిమన్యుడు కాదు అర్జునుడు కావాలి!
posted on: Feb 3, 2026 9:00AM

ఈ మధ్య పవన్ కళ్యాన్ బాగా పొసెసివ్ అయిపోయారు. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని తెలిసిన వెంటనే ఆయన మెట్లు కడిగి ప్రక్షాళన చేశామనడంతో.. ఇప్పుడు సిట్ చార్జిషీట్ తరువాత వైసీపీ నాయకత్వం ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నానా యాగీ చేసిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ వైసీపీయులు తెగ హడావుడి చేస్తున్నారు. సనాతన అంటూ ఒక బిరుదు ముందు చేర్చి మరీ ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసైనికులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటికీ నేనే స్పందించాలంటే మీరెందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎక్కడున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
ఇక అంబటి రాంబాబు అరెస్టుపై పవన్ రియాక్ట్ కావాలంటూ.. వైసీపీ డిమాండ్ చేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబును ఎలివేట్ చేయడానికి వంగవీటి రంగా బొమ్మ తెరపైకి తేవడం పవన్ కల్యాణ్ ను ఒకింత ఇబ్బందుల్లో పడేసిందని పరిశీలకులు అంటున్నారు. ఒక్క అంబటి రాంబాబు విషయమని కాదు కానీ తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేషనల్ గా హేతుబద్ధంగా స్పందిస్తుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం తడబడుతున్నారు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడిలా దూసుకెళ్లిపోవడం కాదు.. అర్జనుడిలా దాన్ని ఛేదించాలని జనసేన క్యాడర్ అంటున్నది.ఏ అంశంపైనైనా దూకుడుగా ముందుకు వెళ్లగలిగిన పవన్ కల్యాణ్.. విమర్శలకు దీటుగా స్పందించి ప్రత్యర్థుల నోళ్లు మూయించే విషయంలో మాత్రం ఒకింత వెనకబడుతున్నారనీ, ఆయన పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడి మాదిరిగా కనిపిస్తోందని అంటున్నారు. అయన తన తీరు మార్చుకుని అభిమన్యుడిలా కాకుండా అర్జనుడిలా నిలవాలని కోరుతున్నారు.
ఇటీవల కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మీడియా ప్రశ్నకు సమాధానం దాటవేయడం కానీ, అంతకు ముందు తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు మైక్ కట్ చేయనడం కానీ పవన్ కల్యాణ్ లో అసహనానికీ, దుందుడుకు తీరుకూ నిదర్శనాలుగా చెబుతున్నారు. ఏదైనా విషయంలో క్లారిటీ ఇవ్వకుండా దాటవేయడం రాజకీయాలలో రాణించదని అంటున్నారు.
గతంలో జగన్ పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై పదే పదే విమర్శలు చేసిన సందర్భంగా పవన్ కల్యాణ్ రా నిన్ను కూడా చేసుకుంటా నాలుగో పెళ్లి అని ఎంత ధైర్యంగా అన్నారో.. అలాగే అదే ధైర్యంతో అన్ని విషయాలలోనూ స్పందించాలని జనసేన కేడర్ కోరుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అర్జనుడిలా రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించుకురావాలి కానీ అభిమన్యుడిలా ఆ పద్మవ్యూహంలో చిక్కుకోకూడదని కోరుతున్నారు.



.webp)


