హైదరాబాద్ వాసులకు జానారెడ్డి హామీలు

 

తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డిని, టీ-కాంగ్రెస్ నేతలు కానీ, తెరాస గానీ, ఉద్యమంలో ఉన్నవారు గానీ ఎవరూ ఎన్నడూ నమ్మలేదు. ఆయన తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కారణంగానే ఎవరూ కూడా ఆయన మాటలను విశ్వసించలేకపోయారు. అటువంటి ఆయన ఇప్పుడు సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు యావత్ టీ-మంత్రుల తరపున ఒక గొప్ప హామీ ఇచ్చారు.

 

ఎపి ఎన్జీఓలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారి భద్రతకు తానూ పూర్తి భరోసా ఇస్తున్నానని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ నివసిస్తున్న ఆంద్ర, రాయలసీమ వాసులకు ప్రజలకు ఉండదలిచిన వారెవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అందుకు తాను హామీ అని అన్నారు. అవసరమైతే వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి అందుకు తగిన అన్ని చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

 

ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తున్నఆంధ్ర ఉద్యోగులు ఏవిధంగాను నష్టపోకుండా వారికి తగిన సదుపాయాలు, సర్వీస్ నిబంధనలను అమలుచేస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా ఒకే కుటుంబంగా కలిసి ఉంటామని ఆయన చెప్పారు. ఎన్.జి.ఓలకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాకేంద్రం నియమించిన అంటోనీ కమిటీకి తెలియచేయాలని, వెంటనే వారు తమ సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

 

ఇటువంటి హామీలు కాంగ్రెస్ నేతలే కాదు, తెరాస నేతలు సైతం ఇస్తున్నసంగతి ఆయనకీ తెలిసే ఉండాలి. కానీ, వారి మాటలకు చేతలకు చాలా తేడా కనబడుతున్న విషయం కూడా ఆయనకి తెలిసే ఉండాలి. ఒకవైపు ఆంధ్ర ప్రజలను ఎవరూ బయటకి పొమ్మనలేదని చెపుతూనే ‘కబడ్దార్ కొడకల్లారా!’ అంటూ అదే నోటితో ప్రజలను భయపెడుతున్నకొందరు అతివాద నేతల ఆలోచనలను జానారెడ్డి వంటి వారే కాదు సాక్షాత్ ప్రధాని హామీ ఇచ్చినా భద్రత ఉండదు.

 

అందువల్లే హైదరాబాద్ లో స్థిరపడిన ప్రజలు తీవ్ర అభద్రతా భావంతో బాధపడుతున్నారు. తెరాస నేతలు చేపట్టిన ఉద్యమంతో ప్రజల మధ్య అగాధం ఏర్పడింది. ఇప్పటికే, స్థానికంగా విద్యా ఉద్యోగ విషయాలలో తీవ్ర వివిక్షను ఎదుర్కొంటున్నఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులకు, జానారెడ్డి వంటి వారిచ్చే హామీలు ఎటువంటి న్యాయం, భద్రతను కల్పించలేవని ఖచ్చితంగా చెప్పవచ్చును. కేవలం చట్టపరమయిన రక్షణలు మాత్రమే వారి భయాలను కొంత మేరయిన తగ్గించగలవు. అయితే, ఇది తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే సాధ్యం గనుక, అంతవరకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అక్కడి ప్రజల కోరుతున్నారు.

 

దీనికి సరయిన పరిష్కారం కనుగొనకుండా ముందుకు సాగినట్లయితే, హైదరాబాదులో తరచూ చెలరేగే మత ఘర్షణల వలెనే, ఆంధ్ర తెలంగాణా ప్రాంత ప్రజల మధ్య కూడా తరచూ ఘర్షణలు, ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంటుంది.