కాశ్మీర్ లో కాశ్మోరా పిశాచాలు!

భారతదేశం ఎదుర్కొంటోన్న తీవ్రమైన సమస్యల్లో కాశ్మీర్ వేర్పాటు వాదం ఒకటి. కాశ్మీర్ కి బయట వున్న మనమంతా కేవలం పాకిస్తాన్ నే శత్రువుగా చూస్తాం. వాళ్లు మన ఆర్మీపై కాల్పులు జరిపితే ఆవేశపడతాం. లేదంటే ఏ క్రికెట్ మ్యాచ్ టైంలోనో దేశభక్తితో రగిలిపోతాం. కాని, కాశ్మీర్ సమస్యకు మరో కోణం వుంది! అదే ఇంటి దొంగల కోణం... 
    

 

దాదాపు 50 రోజుల కింద భారత్ ఆర్మీ ఒక ఉగ్రవాదిని కాశ్మీర్ లో హతం చేసింది. ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని అంతమయ్యాడు. ఇక అక్కడ్నుంచీ కాశ్మీర్ కాలిపోతూ వస్తోంది. వందలు, వేల సంఖ్యలో నిరసనకారులు రోడ్లపై వచ్చి ఆర్మీపై రాళ్లు రువ్వటం, పోలీస్ స్టేషన్లపై దాడి చేయటం రొటీన్ అయిపోయింది. ఆత్మ రక్షణ కోసం ఆర్మీ, పోలీసులు కూడా పెల్లెట్ గన్నుల్లాంటివి ఉపయోగించటంతో చాలా మంది గాయపడ్డారు. కొన్ని మీడియా సంస్థల లెక్కల ప్రకారం పది వేల మంది గాయాల పాలయ్యారు! 70మంది వరకూ చనిపోయారు... ఒక ఉగ్రవాదిని హతం చేస్తే ఇంత నిరసనలు ఎందుకు? ఈ ప్రశ్నకి సమాధానంగానే కాశ్మీర్ లోని ఇంటి దొంగలు బయటపడతారు! వాళ్లకు సాయం చేస్తున్న సో కాల్డ్ లిబరల్స్ కూడా కలుగుల్లోంచి బయటకొస్తారు!

 


    కేంద్రంలో బీజేపి  వున్నా, కాంగ్రెస్ వున్నా కాశ్మీర్ ని కాశ్మోరా పిశాచాల్లా పీక్కుతినే కొన్ని వర్గాలు జమ్మూ, కాశ్మీర్లోనే తిష్ట వేశాయి. వాళ్లని టోకుగా చెప్పుకుంటే వేర్పాటు వాదులు అనొచ్చు. హురియత్ పేరుతో స్థానిక అమాయక, ఆవేశపూరిత యువతని కాశ్మీరియత్ రొంపిలోకి దించుతున్నారు. కాశ్మీరియత్ అంటూ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు చెబుతూ వేర్పాటు వాదం పెంచి పోషిస్తున్నారు. మామూలు టైంలో తిండి, గుడ్డ, గూడు అన్నీ భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే నడుస్తాయి జమ్మూ, కాశ్మీర్ ప్రజలకి. ఇక వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు అయితే నూటా ఇరవై కోట్ల మంది భారతీయులు కట్టిన ట్యాక్స్ లతోనే కాశ్మీర్లో సహయక చర్యలు సాగుతాయి. అలాంటి అవసరమైన సందర్బంలో ఈ వేర్పాటువాదులు సిగ్గు లేకుండా ఇండియన్ ఆర్మీ సహకారం పొందుతారు. తరువాత మాత్రం అదును చూసి ఉగ్రవాదులకి, పాకిస్తాన్ కి మేలు జరిగేలా యూత్ ను రెచ్చగొడుతుంటారు!

 


    వేర్పాటు వాదుల దుర్మార్గం ఒకవైపు అయితే అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే మేధావులు, మీడియా వాళ్ల గోల మరోవైపు. వీళ్లు పైకి వేర్పాటు వాదం సమర్థించినట్టు కనిపించకున్నా లోలోపల వాళ్లతో కలిసి మెలిసి తిరుగుతుంటారు! కొందరు సీనియర్ ఇంగ్లీష్, హిందీ మీడియా జర్నలిస్టులైతే ఏకంగా ఈ వేర్పాటువాదులతో పార్టీలు చేసుకునే దాకా వెళ్లిపోయారు! ఉదాహరణకి బర్కా దత్ అనే ఎన్డీటీవీ సీనియర్ ఎడిటర్ చనిపోయిన ఉగ్రవాది బుర్హాన్ వని ఓ హెడ్మాస్టార్ కొడుకని కథనం ప్రసారం చేసింది. అసలు యాకుబ్ మెమన్ , కసబ్ మొదలు బుర్హాన్ వని దాకా ఉగ్రవాదులందరి మీదా కొన్ని మీడియా సంస్థలకి ఎందుకంత ప్రేమ, గౌరవం అన్నది ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్న!

 


    జమ్మూ, కాశ్మీర్లోని గొడవలకి మన దేశంలోనే అడ్డు అదుపు లేకుండా కథనాలు ప్రసారం చేసే కొంత శాతం మీడియా కారణమన్నది అనుమానమక్కర్లేని విషయం. ఇక వేర్పాటు వాదులు, మీడియా పైత్యమే కాక ప్రతి పక్షం లో వుండే రాజకీయ నేతల స్వార్థం మరోవైపు. ఎవరు అపోజిషన్లో వున్నా ప్రజల తరుపున మాట్లాడుతున్నట్టు నటిస్తూ వేర్పాటు వాదుల్ని బలపరుస్తారు. ఇప్పుడు పీడీపీ ప్రభుత్వం అధికారంలో వుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ నిన్న తీవ్రంగా మాట్లాడారు. పోలీసుల దాడిలో గాయపడ్డవారెవరు చాక్లెట్లు కొనుక్కోటానికి బయటకొచ్చిన చిన్న పిల్లలు కాదనీ, పాలప్యాకెట్ తెచ్చుకోటానికి వచ్చిన సామాన్యులు కాదని అన్నారు! వాళ్లు పోలీసులు, ఆర్మీపై దాడి చేసేందుకే కర్ఫ్యూను ధిక్కరించి రోడ్లపై వచ్చిన అల్లరి మూకలన్నారు! 

 


    ఇదే మెహబూబా తాను ప్రతి పక్షంలో వున్నప్పుడు మాత్రం నిరసనకారుల్ని ఎక్కడలేని విధంగా వెనకేసుకు వచ్చేది. వాళ్ల మీద ఈగ వాలనిచ్చేది కాదు. ఈ ద్వంద్వ ప్రమాణాలే కాశ్మీర్ దొంగలకి లాభసాటిగా మారిపోతున్నాయి. వాళ్లిప్పుడు అమాయక జనాన్ని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ సాయంతో రెచ్చగొడుతున్నారు.

 


    కాశ్మీర్లో ఇంత ఘారం జరుగుతున్నా భారత్ సంతోషించాల్సిన విషయం ఒక్కటే. ఆ రాష్ట్ర సీఎం చెప్పినట్టు ఈ అల్లర్లు మొత్తం ఓ అయిదు శాతం అరాచకుల పనే! మిగతా 95శాతం ఇండియాకి విదేయంగా వుండేవారు. కాబట్టి మోదీ ప్రభుత్వం అటు పాకిస్తాన్ ని పీఓకే విషయంలో, బలూచిస్తాన్ విషయంలో అంతర్జాతీయంగా కార్నర్ చేస్తూ .... ఇటు ఈ అయిదు ఇంటి దొంగల ఆటకట్టించాలి. లేదంటే పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం లేకపోలేదు..