మాటలు ఫుల్.. మేటర్ నిల్.. వైసీపీ కేడర్ డల్!

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు ఆ పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌లకు అంతుప‌ట్ట‌డం లేదు. జ‌గ‌న్ ఎప్పుడు ఏం మాట్లాడ‌తారోన‌న్న ఆందోళ‌న వారిని వెంటాడుతున్నది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించేందుకు మంగ‌ళ‌వారం (ఫిబ్రవరి 18)జ‌గ‌న్ జైలు కెళ్లారు. ప‌రామ‌ర్శ త‌రువాత బ‌య‌ట‌కొచ్చి మీడియాతో మాట్లాడారు. తాను ఒక మాజీ ముఖ్య‌మంత్రి, ఓ పార్టీకి అధినేత‌  అనే సోయి కూడా మ‌ర్చిపోయి పార్టీ కార్య‌క‌ర్త కంటే దారుణంగా మాట్లాడారు జగన్. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నేత‌లు ఇదేం క‌ర్మ‌రా.. ఇందుకేనా వైసీపీలో తాము ఇంకా ఉన్నది అంటూ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ముందు పార్టీ అధినేతగా ఎలా ఉండాలో నేర్చుకో.. ఆ త‌రువాత ప్ర‌తిప‌క్ష నేత హోదా ఇవ్వాల‌ని అడుగు అంటూ సోష‌ల్ మీడియాలో జగన్ పై సెటైర్లు పేలుతున్నాయి. మీడియా స‌మావేశంలో ఎక్కువ భాగం త‌న వెంట తెచ్చుకున్న స్క్రిప్ట్ నే జ‌గ‌న్ చ‌దివారు. ఈ క్ర‌మంలో వంశీ ఏ త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పేందుకు నానా తంటాలు ప‌డ్డాడు.  చంద్ర‌బాబు, లోకేశ్ పై ఎప్ప‌టిలాగే విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్‌.. ప‌నిలోప‌నిగా పోలీసుల‌కూ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎక్క‌డున్నా తీసుకొస్తానంటూ బెదిరించారు.

వ‌ల్ల‌భ‌నేని వంశీ మంచివాడు.. ఆయ‌న‌పై చంద్ర‌బాబు, లోకేశ్ కుట్ర‌పూరితంగా కేసు న‌మోదు చేశార‌ని జ‌గ‌న్ చెప్ప‌డం చూసి వైసీపీ నేత‌లు సైతం న‌వ్వుకున్నారు. గ‌న్న‌వ‌రం  తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి జ‌రిగింది, కార్యాల‌యంలో ఫ‌ర్నీచ‌ర్‌, కార్ల‌ను ద్వంసం చేసింది.. కార్యాల‌యం వ‌ద్ద నిప్పుపెట్టింది.. ఇలా అన్ని  వీడియోలు సోష‌ల్ మీడియాలో ఉన్నాయి. జ‌గ‌న్ మాత్రం గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై అస‌లు దాడే జ‌ర‌గ‌లేదు.. ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగినా అందులో వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌మేయం లేదు.. క‌క్ష‌పూరితంగానే వంశీపై  అక్ర‌మ కేసు పెట్టి ఇబ్బందిపెడుతున్నారంటూ జ‌గ‌న్ అబ‌ద్దాల‌ను అలవోకగా చెప్పేశారు. ప‌నిలో ప‌నిగా కుల ప్ర‌స్తావ‌న కూడా తెచ్చారు. జ‌గ‌న్‌ ఎక్క‌డికి వెళ్లినా.. ఎవ‌ర్ని చూసినా ఆయనకు  కులం త‌ప్ప మ‌రో అంశం గుర్తుకురాదా అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది.  కమ్మ సామాజికవర్గం నుంచి ఎదుగుతున్న వల్లభనేని వంశీని తొక్కేయాలని చంద్రబాబు, లోకశ్‌ ఈ అరెస్టు చేయించారని జ‌గ‌న్ కొత్త క‌థ చెప్పారు. చంద్ర‌బాబు  త‌న కుటుంబం త‌ప్ప కమ్మ సామాజికం వ‌ర్గం నుంచి ఎవ‌రు ఎదిగినా ఓర్వ‌లేరనీ.. అందుకే వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్ ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించారనీ.. ఇప్పుడు క‌క్ష‌పూరితంగా అరెస్టులు చేస్తున్నారనీ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు వంశీని అరెస్టు చేశారు.. రేపేమాపో కొడాలి నాని, అవినాశ్ ను కూడా అరెస్టులు చేస్తారంటూ జ‌గ‌న్ చెప్పుకొచ్చాడు. 

నిజమే ముమ్మాటికీ త్వ‌ర‌లోనే కొడాలి నాని, అవినాశ్ లు కూడా జైలుకెళ్ల‌బోతున్నారు. ఈ విషయంలో జగన్ జోస్యం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.   ఎందుకంటే జగన్ అండ చూసుకుని వారు చేసిన అరాచకాలకు సంబంధించి వారిపై కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో వారు అరెస్టు కాక తప్పదు.  ఇక గ‌తంలో అంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు త‌న సొంత సామాజిక వ‌ర్గం వారికి మాత్ర‌మే  ప‌ద‌వులు ఇచ్చుకుంటున్నారు..   వారిని మాత్ర‌మే పైకితెస్తున్నారంటూ ఇదే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌దేప‌దే మీడియా ముందు అడ్డ‌గోలుగా మాట్లాడారు. దీనికితోడు చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంపై వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా అక్క‌స్సు వెళ్ల‌గ‌క్కారు. 

ఆ తరువాత 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచీ వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యాపార‌వేత్త‌ల‌పై జగన్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఇవాళ వంశీని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్ .. చంద్ర‌బాబు  తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వ‌ర్గంలో ఎవ‌ర్నీ పైకిరానివ్వ‌రు.. అందుకే  రాజ‌కీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అవినాశ్ ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అంటూ జ‌గ‌న్ కొత్త రాగం అందుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిని చూసి వైసీపీ నేత‌లుసైతం చీద‌రించుకుంటున్నారు. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతూ జ‌గ‌నే స్వ‌యంగా వైసీపీని భూస్థాపితం చేసుకుంటున్నారని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 

వాస్త‌వానికి వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు గౌరవంగా ఉండేవారు. రాజకీయ విమర్శలు చేసినా పద్దతిగానే చేసేవారు. నియోజకవర్గంలో ఏదైనా తప్పుడు పని చేయాలన్నా చంద్రబాబు, లోకేష్ ప్రశ్నిస్తారని, నిలదీస్తారనీ భయపడేవారు. కానీ వైసీపీలో చేరిన తర్వాత ఆయన అందరిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుని అందరికీ కాని వారయ్యారు. ఇప్పుడు ఆయన కు వైసీపీ నేతల సపోర్టు కూడా లేదన్నది బహిరంగ రహస్యం. వదిలేశారు అంటారని.. కంటి తుడుపు పరామర్శలు చేస్తున్నారు. జ‌గ‌న్ కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తారు. జ‌గ‌న్‌కు క‌మ్మ సామాజిక వ‌ర్గం అంటే అస‌లే ప‌డ‌దు. కేవ‌లం చంద్ర‌బాబు, లోకేశ్ ను ప‌దేప‌దే దూషిస్తున్నార‌న్న కార‌ణంతోనే కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అవినాశ్ ల‌ను జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్నార‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

అయితే, ప‌నిలోప‌నిగా అందం గురించి కూడా జ‌గ‌న్ ప్ర‌స్తావించాడు. చంద్ర‌బాబు, లోకేశ్ కంటే వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, అవినాశ్ లు అందంగా ఉంటార‌ట‌. అందుక‌నే క‌క్ష‌పూరితంగా వ‌ల్ల‌భ‌నేని వంశీపై అక్ర‌మ‌ కేసులు పెట్టార‌ట‌.. కొడాలి నాని, అవినాశ్ కూడా అందంగా ఉండ‌టంతో వారిపైనా త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు అక్ర‌మ‌ కేసులు పెడ‌తార‌ట‌. ఇంతకీ.. వారి అందాన్ని చూసే జ‌గ‌న్ కూడా వైసీపీలో చేర్చుకున్నారా?  జగన్ బావ బ్రదర్ అనిల్ కూడా అందగాడే క‌దా.. ఆయనను జ‌గ‌న్ ఎందుకు వ‌ద్ద‌నుకున్నారు? కొడాలి నాని, వంశీ, అవినాశ్ ఉన్నారు క‌దా చాలనుకున్నారా?   అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు.  మొత్తానికి జ‌గ‌న్ మీడియా స‌మావేశాన్ని చూసిన ప్ర‌జ‌లు.. జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా కాదుక‌దా.. అస‌లు వైసీపీ లేకుండా చేస్తేనే బెట‌ర్ అన్న ఆలోచ‌న‌కు వ‌చ్చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu