TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనాదరణలో అట్టడుగున జగన్!

Published on: Wed Jul 13, 2022 11:17AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాదరణ దారుణంగా పడిపోయింది. దేశంలోని 25 సీఎంలలో అట్టడుగు నుంచి ఆరో స్థానం జగన్ కు వచ్చింది.  సెంటర్ ఫర్ నేషనల్ ఓపీనియన్ సర్వే తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు జగన్ భవిష్యత్ ఏంటో తేల్చేశాయి. ముఖ్యమంత్రులకు జనంలో ఉన్న ఆదరణ అన్న అంశంలో సీఎన్ఓఎస్  నిర్వహించిన సర్వేలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో 11వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని  రాష్ట్రాల సీఎంలకు ప్రజల నుంచి ఆదరణ ఏ మేరకు ఉందనే అంశంపై సీఎన్ఓఎస్   ఇటీవల ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీ సీఎం వైఎస్ జగన్ 20వ స్థానంలో ఉన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేత అని, జనం నుంచి ఎంతో ఆదరణ ఉందంటూ జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్గాలు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాయి.

అయితే.. జగన్ ప్రభ వైసీపీ సొంత భజన చేసుకుంటున్నట్లుగా లేదని  పైపెచ్చు.. అసలు ఆయనకు జనాదరణే లేదనీ   తాజా సర్వేలో తేటతెల్లం చేసేసింది. ఏపీలో నిర్వహించిన సర్వేలో జగన్ నాయకత్వంపై 39 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.  29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 32 శాతం మంది తటస్థంగా ఉన్నారు. జగన్  అనుభవ రాహిత్యం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల  అభివృద్ధిని అగుడంటిందనీ, సంక్షేమ కార్యక్రమాల అమలులో కోతల వల్ల  జనామోదం అడుగంటిందనీ సర్వే తేల్చేసింది.  

ఏపీకి కొత్త పరిశ్రమలు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలు తరలిపోయే పరిస్థితులు ఉన్నాయనీ, విద్యుత్ తదితర సమస్యల వల్ల ఉన్న పరిశ్రమలలో కొత్త ఉద్యోగాలు రాకపోవడం,  ఉద్యోగులు, ఉపాధ్యాయులతో రగడ, రహదారుల దుస్థితి వంటి కారణాలతో  జగన్ పై జనంలో అసంతృప్తి గూడుకట్టుకుందన్నది సర్వే సారాంశం. ఇక ఈ సర్వే ఫలితాల్లో 11వ స్థానంలో నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 19 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సర్వేలో 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నిలిచిన ఒడిశా సీఎం విషయంలో ఆ రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంపై ఒడిశా ప్రజలు 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కేవలం 19 శాతం మంది మాత్రమే తమ సీఎం పట్ల ఒడిశా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దేశంలో అత్యంత జనాదరణ పొందిన తొలి ఐదుగురు సీఎంలలో 51 పాయింట్ల కచ్చితమైన ఆమోదంతో నవీన్ పట్నాయక్ నిలిచారు.  ఆ తరువాతి స్థానాల్లో వరుసగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇటీవలే రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ,  పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ సింగ్ మాన్ నిలిచారు. ఇక జగన్ తరువాతి  స్థానాల్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్, నాగాలాండ్ సీఎం నీఫూ రియో, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహ ఉన్నారు.