TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ జగన్ పరామర్శ యాత్రలు

Published on: Tue Feb 3, 2026 10:21AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి పరామర్శ యాత్రలకు శ్రీకారం చుట్టనున్నారు. తాజాగా ఆయన రెండు రోజుల పాటు పరామర్శయాత్రకు రెడీ అయిపోయారు. ఔను ఆయన బుధ, శుక్రవారాలలో రాష్ట్రంలో  పరామర్శ పర్యటన చేస్తారు. బుధవారం గుంటూరు, శుక్రవారం ఇబ్రహీం పట్నం లలో ఆయన పరామర్శ యాత్రలు ఉండనున్నాయి. ఈ యాత్రలలో భాగంగా ఆయన గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను, శుక్రవారం ఇబ్రహీంపట్నలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు అధికారికంగా తెలిపాయి. 

జగన్  అంబటి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రెడీ అవ్వడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి.  అరెస్టైన నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులన పరామర్శించడం ఓకే.. అసెంబ్లీకి వచ్చి ఇదే అంశాలపై మాట్లాడడానికి జగన్ కు ధైర్యం ఉందా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అంబటి, జోగి రమేష్ ల విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తే అసలు బండారం బయటపడుతుందన్న భయం జగన్ ను వెంటాడుతోందంటున్నారు. అయినా జగన్ పరామర్శయాత్రలంటే జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఉదహరిస్తున్నారు.  పరామర్శల పేరుతో  జగన్ చేసే  పర్యటనల అసలు లక్ష్యం శాంతి భద్రతల సమస్య సృష్టించడమేనని విమర్శిస్తున్నారు.

 గతంలో గుంటూరు, అనంతపురం,  సత్య సాయి జిల్లాలో ఆయన పర్యటన చేసినప్పుడు జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. అసలే ఉద్రిక్తతలు నెలకొన్న గుంటూరు, ఇబ్రహీంపట్నంలో జగన్ పరామర్శ యాత్ర శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పరామర్శల పేరుతో శాంతికి భంగం కలిగించే కంటే.. ఈ నెలలోనే జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై తిరుమల ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సహా అన్ని అంశాలపై చర్చిస్తే మేలన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.