ప్రభుత్వం కూలిపోతుందని జగన్ ఏవిధంగా చెపుతున్నారు?

 

వైయస్సార్ కాంగ్రే అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని ఎంతగా పరితపించిపోతుంటారో అందరికీ తెలుసు. అందుకే ఆయన తరచూ త్వరలోనే తెదేపా ప్రభుత్వం కూలిపోతుందని, తను ముఖ్యమంత్రి అవుతానని జోస్యం చెపుతుంటారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఏర్పడినా దానికి ఆయన చెప్పే ఏకైక పరిష్కారం అదే. తను ముఖ్యమంత్రి అవగానే అన్ని సమస్యలను మంత్రదండం తిప్పి మాయం చేసినట్లు మాయం చేసేస్తానని చెపుతుంటారు. కానీ వ్యవసాయ రుణాలు మాత్రం తీర్చలేనని నిజాయితీగా ఒప్పేసుకొంటారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను కలుసుకొన్నప్పుడు కూడా ఆయన మళ్ళీ అదే పరిష్కార మార్గం చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, పంట రుణాలు మాఫీ చేయకుండా మోసం చేసినందునే రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కానీ పంట రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని, ఆ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని చెపుతున్న జగన్మోహన్ రెడ్డి మరి తను అధికారంలోకి వస్తే వారి రుణాలు మాఫీ చేయకుండా ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనుకొంటున్నారో తెలియదు కానీ, తను ముఖ్యమంత్రి అయిపోతే వారి సమస్యలన్నీ తీరిపోతాయని హామీ మాత్రం గట్టిగా ఇస్తున్నారు. ప్రజలు ఎన్నుకొన్న తెదేపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన తరచూ జోస్యం చెపుతుంటారు. కానీ అది ఏవిధంగా సాధ్యమో చెప్పకపోవడంతో ప్రజలు ఆయననే అనుమానించే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటున్నారు.

 

తెరాస నిజామాబాద్ ఎంపీ కవిత నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఆయన లోటస్ పాండ్ నివాసానికి వచ్చి జగన్ తో మంతనాలు సాగించినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. తెలంగాణా వ్యాప్తంగా త్వరలో జరుగనున్న బ్రతుకమ్మ పండుగ సందర్భంగా ఆడే బ్రతుకమ్మ ఆటలో జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని కూడా పాల్గొనమని ఆహ్వానించేందుకే కవిత వచ్చేరని చెపుతున్నప్పటికీ, బలమయిన కారణాలు వేరే ఏవో ఉండవచ్చని అందరూ అనుమానిస్తున్నారు.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం కలహిస్తూ, హైదరాబాద్ లో స్థిరపడిన రాష్ట్ర ప్రజల పట్ల తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్న తెరాస నేతలతో ఆంధ్రాకు చెందిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా రహస్య మంతనాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓటుకి నోటు కేసులో తెరాస ప్రభుత్వం తరపున చాలా బలంగా వాదిస్తూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పదవి నుండి దిగిపోవాలని వాదించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి తెరాస నేతలతో కలిసి కొత్తగా ఏమయినా కుట్రలు పన్నుతున్నారా? అందుకే ఈ త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెపుతున్నారా? అని తెదేపా నేతలు అనుమానిస్తున్నారు.

 

జగన్మోహన్ రెడ్డి తన బద్ద శత్రువుగా భావించే ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుతో . నాలుగయిదు రోజుల క్రితం రహస్య మంతనాలు జరపడం, మళ్ళీ నిన్న తెరాస ఎంపీ కవితతో రహస్య మంతనాలు జరపడం ఆ అనుమానాలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. కనుక ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతోందని జోస్యం చెప్పేటప్పుడు అది ఏవిధంగా సాధ్యమో కూడా వివరించవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలు కూడా ఆయనని అనుమానించే ప్రమాదం ఉంది.