ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలకి జగన్ బహిరంగ లేఖ

 

రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తుండటం సర్వ సాధారణ విషయమే. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమ్మెలను తీవ్రంగా పరిగణించే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వారికి మద్దతు పలుకుతుంటాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరుగుతోంది. అధికారంలో ఉన్న తెదేపా, తెరాస ప్రభుత్వాలు ఈ సమ్మెను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఆవస్తలు పడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు వారి సమ్మెకు మద్దతు పలుకుతున్నాయి.ఒకవైపు వారికి సమ్మెకు మద్దతు తెలపడం ద్వారా వారి సమ్మెను మరింత ఉదృతంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని నిందిస్తుంటారు. అలాగని ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలకి వారిపై నిజంగా ప్రేమ ఏమయినా ఉందా? వారి పట్ల నిజంగానే సానుభూతి కలిగి ఉన్నాయా? అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. వారి సమస్యలని పరిష్కరింపబడాలనే తపన కంటే తమ రాజకీయ శత్రువయిన అధికార పార్టీలని ఈవిధంగా ఇబ్బంది పెట్టాలనే తాపత్రయమే ఎక్కువ. ఉద్యోగులు సమ్మెకు మద్దతు పలికితే వారు తమ పార్టీల వైపు మొగ్గు చూపవచ్చనే చిన్న ఆశతోనే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉద్యోగులు చేసే ఏ సమ్మెలకయినా మద్దతు పలుకుతుంటాయనేది బహిరంగ రహస్యమే.

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రెండు రాష్ట్రాలలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు తెలుపమని తన పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడమే కాకుండా వారి న్యాయబద్దమయిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సూచిస్తూ రెండు ప్రభుత్వాలకి ఒక బహిరంగ లేఖ కూడా వ్రాసారు. రెండు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకి ఇచ్చిన హామీలను పక్కనబెట్టడం వలననే ఈ సమస్య ఏర్పడిందని,కనుక ఇప్పటికయినా వారిరువురూ ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చేరు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ప్రతీకార ధోరణితో వ్యవహరించకుండా వారితో సుహృద్భావ వాతావరణంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

 

ఆయన తన లేఖలో కొన్ని నిర్మాణాత్మకమయిన సలహాలు కూడా చేసారు. రెండు రాష్ట్రాలలో తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల వలన ఆర్టీసీకి ప్రతీ ఏట సుమారు రూ.1000 కోట్లు నష్టం వస్తోందని ప్రభుత్వమే చెపుతున్నప్పుడు, వాటిని ఎందుకు నియంత్రించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ నుండి డీజిల్ కొనుగోలుపై రూ.541 కోట్లు, విడిభాగాల కొనుగోలుపై మరో రూ.150 కోట్లు వ్యాట్ పన్ను వసూలు చేస్తోందని, ప్రభుత్వం దానిని వదులుకొనేందుకు సిద్దపడితే ఆర్టీసీ తన నష్టాల నుండి తేలికగా బయటపడగలదని ఆయన సూచించారు. మరి జగన్ వ్రాసిన ఈ బహిరంగ లేఖకి రెండు ప్రభుత్వాలు వాటిని నడిపిస్తున్న తెదేపా, తెరాసలు ఏమని సమాధానం చెపుతాయో వేచి చూడాలి.