ఏప్రిల్ నెలకోసం జగన్ ఎదురుచూపులు

 

అక్రమాస్తులకేసులో అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్. జగన్ మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడివలె బెయిలు కోసం అనేక సార్లు ప్రయత్నించినపటికీ, సీబీఐ ఎప్పటికప్పుడు సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో, తొమ్మిది నెలలు గడిచినా ఆయనకీ ఇంతవరకు బెయిలు భాగ్యం దొరకలేదు. అయితే, పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల గత కొన్ని రోజులుగా త్వరలో అన్న బయటకి వచ్చేస్తున్నాడంటూ కొంచెం నమ్మకంగానే చెపుతున్నారు.

 

జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి రావడానికి మరెంతో కాలం పట్టదని ఆయన పార్టీ నేతలు కూడా చాల గట్టిగానే చెపుతున్నారు. అయితే, వారు అంత ధృడంగా విస్వసించడానికిగల కారణాలు ఏమిటంటే, గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పుడు, రాష్ట్ర కోర్టుల్లో తేల్చుకోవలసిన అంశాన్ని తన వద్దకు తీసుకురావద్దని హెచ్చరిస్తూనే, ఒకవేళ సీబీఐ గనుక ఇప్పట్లో విచారణ పూర్తిచేయలేదని తాము భావించినట్లయితే అప్పుడు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని జగన్ మోహన్ రెడ్డి లాయర్లకు హామీ ఇచ్చింది. అంతే గాకుండా, సీబీఐను త్వరగా విచారణ పూర్తిచేయడం మంచిదని హెచ్చరించింది. అదే సమయంలో మార్చి నెలలోగా విచారణ పూర్తిచేయడానికి ప్రయత్నించామని సీబీఐ ను కోరింది.

 

ఇటీవల సిబీఐ నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, బహుశః అదే కారణంతో జగన్ లాయర్లు తీవ్రంగా వ్యతిరేఖించి ఉంటారు. వచ్చేనెలలోగా సిబీఐ విచారణ ఎలాగు పూర్తిచేయలేదు కనుక, ఇప్పుడు దానిని అభియోగాపత్రం నమోదు చేయనిచ్చినట్లయితే, అప్పుడు బెయిలు కోరెందుకు సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతోనే వారు సిబీఐను అడ్డుకొని ఉండవచ్చును. బహుశః వారు జగన్ మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఏప్రిల్ నెలలో బెయిలు వస్తుందని భరోసా ఈయడం వల్లనే, షర్మిలతో సహా ఆ పార్టీ నేతలందరూ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదల అవుతాడని నమ్మకంగా ప్రజలకి చెపుతున్నారనుకోవచ్చును.

 

అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా ఏప్రిల్ నెల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సారి కూడా బెయిలు దొరకకపోతే జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ తప్పదు. తత్ఫలితంగా, ఆయన ఆగ్రహావేశాలకి సహజంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే బలయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గనుక బెయిలుపై విడుదల అయినట్లయితే, జగన్ మోహన్ రెడ్డి కొంచెం సర్ధుకొనే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మరి కొద్ది రోజులు అవకాశం దక్కే అవకాశం ఉంటుంది.