జగన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్

 

జగన్ మోహన్ రెడ్డి గత 11నెలలుగా జైలులో ఉన్నపటికీ, ఆయన పార్టీ ఇంకా పటిష్టంగా కనబడటానికి ప్రధాన కారణం ఆయన అనుసరిస్తున్న ప్రత్యేక వ్యూహమే కారణమని చెప్పవచ్చును. ఆయన జైలులోకి వెళ్లినప్పటినుండి నేటి వరకు కూడా, ఆయన ఎంచుకొన్న మార్గం ఏమయితేనేమి ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్ణీత వ్యవదుల మద్య వివిధ పార్టీలలో ఉన్నముఖ్య నేతలను తన పార్టీలో చేరేలా చేసుకోవడం ద్వారా పార్టీపై అందరి అంచనాలు ఉన్నతంగా ఉండేలా చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన ఒక తెలివయిన వ్యాపారి (బిజినెస్ మ్యాన్) లక్షణాలు కనబరుస్తూ, తన సంస్థను అసలు కంటే పదింతలు బలమయినదని సమర్ధంగా చూపగలుగుతున్నారు.

 

బహుశః ఈ కారణం చేతనే ఆయనపై ఒకపక్క కోర్టులో తీవ్ర నేరాభియోగాలు మోపబడి కేసులు నడుస్తున్నపటికీ, ఆయన పార్టీకి ఉజ్వలమయిన భవిష్యత్ ఉందని ప్రజలను, విపక్ష నేతలను కూడా గట్టిగా నమ్మించగలుగుతున్నారు. తద్వారా ఇతర పార్టీల నుండి వలసలు కూడా నిత్యం కొనసాగేలా చేసుకోగలుగుతున్నారు. వ్యాపారంలో కొంత మేర డబ్బు సంపాదించిన తరువాత ఆ డబ్బే మళ్ళీ డబ్బును సృష్టించినట్లు వలసలు కొత్త వలసదారులను ప్రోత్సహిస్తున్నాయి.

 

అందుకు ఆయన చేతిలో ఉన్న మూడు బలమయిన ఆయుధాలను చాల తెలివిగా వాడుకొంటున్నారు. అవి 1.సాక్షి మీడియా, 2.తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రతిష్టలు,3.సానుభూతి.

 

రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయిపోయినప్పటికీ నేటికీ ఆయన పట్ల ప్రజలలో సానుభూతిని అదే స్థాయిలో నిలిపేందుకు గతంలో జగన్ తన ‘ఓదార్పుయాత్ర’ చేయగా, ప్రస్తుతం ఆ బాధ్యతను షర్మిల తన ‘మరో ప్రస్థానం’ పాదయాత్రతో, విజయమ్మ తన బహిరంగ సభలు, ఇటీవల ‘రచ్చబండ’ వంటి కార్యక్రమాలతో సమర్ధంగా నిలుపుకొస్తున్నారని చెప్పవచ్చును. వారిరువురూ నిత్యం ప్రజల ముందు ‘రాజన్న రాజ్యం వస్తుందని’ జపించడం అందుకేనని చెప్పవచ్చును.

 

తెరాస తన ఉనికిని కాపాడుకోవడానికి, లేదా ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి ‘తెలంగాణా సెంటిమెంటు’ను ఏవిధంగా సమర్ధంగా వాడుకొంటోందో, అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ‘సానుభూతి’ సెంటిమెంటుని నిలుపుకొస్తోందని చెప్పవచ్చును.

 

నిజాయితీగా చెప్పుకోవాలంటే ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు అవినీతి, అసమర్ధత వంటి సమస్యలకంటే సానుభూతి అంశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది బహిరంగ రహస్యం. దీనిని సరిగ్గా గ్రహించిన ఏ రాజకీయనాయకుడయినా, రాజకీయ పార్టీ అయినా దానిని పూర్తిగా సద్వినియోగపరుచుకొనే ప్రయత్నం తప్పక చేస్తారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదేపని చేస్తున్నారు. అందుకు ఆయన చేతిలో ఉన్న మరో బలమయిన ఆయుధం సాక్షి మీడియాను కూడా ఆయన చాలా సమర్ధంగా ఉపయోగించుకొంటున్నారు.

 

ఆయనే గనుక సాక్షి మీడియాను ఏర్పాటు చేసుకొని ఉండకపోయి ఉంటే, నేడు ఆయన పార్టీ పట్ల ప్రజలలో ఇంత అవగాహన, ఆదరణ ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. నేడు జరుగుతున్న ఈ పరిణామాలన్నిటినీ ఆయన ముందుగానే ఊహించి సాక్షిని ఏర్పాటుచేసుకొన్నాడని చెప్పడం అవివేకమే అవుతుంది, కానీ ఆనాడు ఆయన ఏ కారణాలతో, ఉద్దేశ్యంతో దానిని స్థాపించినప్పటికీ నేడు అదే ఆయనకి శ్రీ రామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చును.

 

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరే ఇతర రాజకీయ నాయకుడికయినా ఎదురయి ఉంటే ఖచ్చితంగా  అతను రాజకీయాల్లోంచి ఎపుడో కనుమరుగయిపోయి ఉండేవాడు. కానీ జగన్ మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి రాకుండా కాపాడుతున్నది ఆయన సాక్షి పత్రిక మాత్రమేనని చెప్పక తప్పదు. ఆ ఒక్క పత్రిక తప్ప రాష్ట్రంలో, దేశంలో ఆయనకు, ఆయన పార్టీకి అనుకూలంగా వాదిస్తున్న పత్రిక లేదా న్యూస్ చానల్ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అది కూడా లేకపోయుంటే, నేడు ఆయనపై కత్తిగట్టిన యావత్ మీడియా ప్రభావంతో ప్రజలు ఆయనని, ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని ఎన్నడో మరిచిపోయుండేవారేమో కూడా.

 

ఏమయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉన్నపటికీ, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నపటికీ, ఆయన తన పార్టీపై ప్రజలలో, తన శత్రు పార్టీలలో అంచనాలు పెంచడంలో కృతకృత్యులయ్యారని చెప్పక తప్పదు. ఆయన తన చేతిలో ఉన్న ఈ మూడు ఆయుదాలను అత్యంత సమర్ధంగా వాడుకొంటు తెలివయిన వ్యూహాలతో దూసుకుపోవడమే ఆయన విజయ రహస్యం అనుకొంటే, వైరి పక్షాలలో ఉండే సమస్యలు, ముటాలు, వాటి మద్య తగాదాలు వంటి బలహీనతలు ఆయనకు మరో చక్కటి ఆయుధంగా మారాయని చెప్పవచ్చును.

 

జైలులో ఉంటూ, అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి రచిస్తున్నవ్యూహాలను, బయట ప్రజల మద్య ఉంటూ మీడియా యొక్క అండదండలు కలిగి ఉన్న ఆయన ప్రత్యర్ధులు ఎదుర్కోలేక బెంబేలెత్తిపోవడమే కాకుండా, ఆయన దెబ్బకి తరచూ బోర్లాపడిపోతుండటం సామాన్య ప్రజలకి కూడా నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆయన జైలు నుండి విడుదల అయితే ఆయన ధాటికి వారు తట్టుకోగలరా? అనే ఆలోచన కూడా ప్రజలలో తలెత్తడం సహజమే.

 

కాంగ్రెస్, తెదేపాలు రెండూకలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని జైలులో నిర్బందించాయని, షర్మిల, విజయమ్మలు బహుశః అందుకే పదేపదే ఆరోపిస్తున్నారేమో కూడా. ఇక ఇదంతా గమనిస్తే జగన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని అందరు ఒప్పుకోవలసిందే.