కాంగ్రెస్ తెదేపాల ఆరోపణలు ద్రువీకరిస్తున్న వైకాపా

 

జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చుకొని అక్కడి నుండే పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వంతపాడటం మొదలుపెట్టాక, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు మరో అడుగు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డిని వేరే రాష్ట్రంలో వేరే జైలుకు తరలించాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ ఉలిక్కిపడింది.

 

అయితే, అప్పుడు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు, కాంగ్రెస్, తెదేపాలు చేస్తున్న ఆరోపణలు ఖండించకపోగా, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి రాజకీయాలు చేస్తే తప్పేమేటి? అలా చేయకూడదని ఏ చట్టం చెపుతోందని ఎదురు ప్రశ్నించారు. తద్వారా కాంగ్రెస్ తెదేపాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయనే అంగీకరించినట్లయింది. ఆయన నాలిక కరుచుకొన్నపటికీ అప్పటికే జరగవలసిన అనర్ధం కాస్తా జరిగిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు తెదేపా చేస్తున్నఆరోపణలను దృవీకరించినట్లయింది.

 

దానితో ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి ఈ ఆరోపణలలో నిజానిజాలు నిర్ధారించేందుకు వెంటనే విచారణ చేప్పట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డిని కోరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయింది.

 

ఇప్పుడు గట్టిగా ఎదురు నిలబడి మాట్లాడకపోతే క్రమంగా ఈ వ్యవహారం ముదిరి చివరికి కోర్టు జగన్ మోహన్ రెడ్డిని నిజంగానే వేరే రాష్ట్రంలో వేరే జైలుకి తరలించమని ఆదేశిస్తే, ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమ పార్టీకి, అది మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని తీవ్ర ఆందోళన చెందిన వైకాపా ఈ సమస్యనుండి బయటపడేందుకు ఇప్పుడు ‘జగన్ కి వ్యతిరేఖంగా కాంగ్రెస్ తెదేపాలు కుట్ర’ అనే కొత్త పల్లవి అందుకొంది. ఆ రెండు పార్టీలు కలిసి తమ అధినేతను తమకి దూరం చేసి, అతనిని జైలుకే పరిమితం చేయాలని దురాలోచనతోనే జగన్నిఏ తీహార్ జైలుకో పంపేందుకు కుట్ర పన్నుతున్నాయని వైకాపా ఆరోపణలు మొదలుపెట్టింది.

 

జగన్ మోహన్ రెడ్డి భార్య శ్రీమతి భారతి కూడా తన భర్తను దర్యాప్తు పేరిట ఇంకా ఎంతకాలం జైల్లో పెడతారు? అదే చంద్రబాబో, కిరణ్‌ కుమారో లోపల ఉంటే, అప్పుడు ఇలాగే తమ భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి అంటే వాళ్లు, వాళ్ల వెనకున్న పార్టీలు ఊరుకుంటాయా? అంటూ ఆమె ఒక ధర్మ సందేహం లేవనెత్తారు మంత్రులకో న్యాయం, చంద్రబాబుగారికో న్యాయం, జగన్ గారికి మాత్రం వేరే న్యాయం.. ఇదెక్కడి న్యాయం అని ఆమె ప్రశ్నించారు.

 

ఒక మహిళగా ఆమె తన భర్త పరిస్థితికి ఆవిధంగా ఆవేదన చెందడం సహజమే. కానీ, తన భర్తలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా జైలు వెళ్ళవలసివస్తే, ఇదే విదమయిన ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తే అని ఊహాజనితమయిన ఆలోచనలతో ఒక వితండవాదన చేయడం చాలా విడ్డూరం. అమాయకుడయిన తన భర్తకి వ్యతిరేఖంగా వారిరువురూ కలిసి కుట్ర పన్నుతున్నారని, అందువల్లనే జగన్ జైలు నుండి విడుదలకాలేకపోతున్నాడని ఆమె గనుక దృడంగా నమ్ముతుంటే, అదే విషయంపై ఆమె న్యాయపోరాటం చేయవచ్చును.

 

ఒక పేదవాడికి అన్యాయం జరిగితే కోర్టుకి మొరపెట్టుకోవడానికి వీలుపడదేమో కానీ, జగన్ మోహన్ రెడ్డి వంటి కొట్లాదిపతికి జరుగుతున్నఅన్యాయాన్ని ప్రశ్నించేందుకు హేమా హేమీలవంటి లాయర్లను నియమించుకొని న్యాయపోరాటం చేయడం కష్టం కాదు. కానీ అతను, అతని కుటుంబ సభ్యులు, అతని పార్టీ నేతలు ఎవరూ కూడా ఆ పనిచేయకుండా కాంగ్రెస్ తెదేపాలు నిందిస్తూ కాలక్షేపం ఎందుకు చేస్తున్నట్లు? మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకనా? జగన్ మోహన్ రెడ్డి అమాయకుడని గ్రామీణ ప్రజలకు నచ్చజెప్పినట్లు దేశంలో ఏ కోర్టుకి నచ్చచెప్పడం కుదరదనే గ్రహింపు వలననా? లేక వేరే చెప్పలేని కారణాల వలననా? వారే చెప్పాలి.

 

ఇక శ్రీమతి భారతి కూడా ‘భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి’ అనే అంశంపై మాట్లాడిన మాటలు, చెపుతున్న అభ్యంతరాలు కాంగ్రెస్, తెదేపాల ఆరోపణలకే బలం చేకూర్చేవిదంగానే ఉన్నాయి. తద్వారా జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి రాజకీయాలు చేయడం, జైలు నియమ నిబంధనలను ఉల్లంఘించి 8 మంది కంటే చాలా ఎక్కువ మందినే కలుస్తున్నట్లు ఆమె కూడా అంగీకరించినట్లయింది. తద్వారా జైలు సుపరిండేంట్ బీ. సైదయ్య పై తెదేపా చేస్తున్న ఆరోపణలు కూడా అంగీకరించినట్లే అయింది.

 

ఈ విధంగా వైకాపా నేతలే స్వయంగా ఉన్నసమస్యను భూతద్ధంలో కాంగ్రెస్ తెదేపాలకు చూపిస్తున్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ తెదేపాలను నిందిస్తూ కాలక్షేపం చేసేబదులు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తే వెంటనే న్యాయపోరాటం చేయడం మంచిది.

 

అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని దృడంగా భావిస్తే, తమ ఆరోపణలకు సరయిన ఆధారాలుంటే వారిరువురినీ కూడా కోర్టుకీడ్చి అమీతుమీ తేల్చుకోవడం మంచిది. లేకుంటే, జగన్ మోహన్ రెడ్డి కేసుల సంగతిని కోర్టులకి వదిలిపెట్టి, ఎటువంటి రోగాలనయినా, ఎటువంటి క్లిష్ట సమస్యలయినా తన దైవికశక్తులతో చిటికలో మాయం చేసేయగల తమ స్వంత కుటుంబ సభ్యుడయిన బ్రదర అనిల్ కుమార్ ను ఆశ్రయించడం వారి ముందున్న మరో మార్గం.