ఒక్క కేసుకి ఇన్ని చార్జ్ షీట్లా?

 

జగన్మోహన్ రెడ్డి జైలు, బెయిలు, రిమాండు పొడిగింపు, సీబీఐ కేసులు, చార్జ్ షీట్లు, విచారణలు, వాయిదాలు వగైరా మీడియాలో నిత్యం వస్తున్నవార్తల వలన సామాన్య ప్రజలకి కూడా ఇప్పుడు న్యాయపరమయిన విషయాల గురించి కొంత అవగాహన పెరిగిందని చెప్పవచ్చును. వెయ్యెకరాలు మాగాణీ పోతేపోయింది కానీ, లా మాత్రం క్షుణ్ణంగా బోధపడిందని వెనకటికి ఎవరో అన్నట్లు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల పేరిట లక్షలాది ఎకరాలు, కోట్లాది రూపాయల ప్రజాధనం పోయినప్పటికీ జగన్ అక్రామాస్తుల కేసుల వలన ప్రజలకి కూడా లా క్రమంగా అర్ధం అవుతోంది.

 

ఇక విషయంలోకి వస్తే, బుధవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టులోజగన్మోహన్ రెడ్డిపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన 5వ చార్జ్ షీట్ పై ఇరువర్గాల మద్య వాదనలు జరిగాయి. జగన్ మరియు విజయసాయి రెడ్డిల లాయర్లు “సీబీఐ, సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట ప్రకారం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అన్ని అంశాలకు కలిపి ఒకే చార్జ్ షీట్ దాఖలు చేయకుండా, ఒక్కో అంశానికి వేర్వేరుగా దాఖలు చేస్తోందని, ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, అందువల్ల మొన్న సీబీఐ దాఖలు చేసిన 5వ చార్జ్ షీటునే జగన్ కేసుల్లో ఆఖరి చార్జ్ షీటుగా కోర్టు పరిగణించి, సీబీఐ మళ్ళీ ఇక చార్జ్ షీట్లు దాఖలు చేయకుండా నిరోదించాలని వారు వాదించారు.

 

కానీ, వారి వాదనను సీబీఐ న్యాయవాదులు త్రోసిపుచ్చుతూ, అసలు సుప్రీం కోర్టు కంసోలిడేటెడ్ చార్జ్ షీట్ వేయాలని ఎన్నడూ తమని ఆదేశించలేదని, అదేవిధంగా తాము కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో అన్ని అంశాలకు కలిపి ఒకటే చార్జ్ షీట్ వేస్తామని సుప్రీం కోర్టుకు ఎన్నడూ మాటీయలేదని, అందువల్ల వివిధ అంశాలకి వేర్వేరు చార్జ్ షీట్లు వేయడం తప్పనిసరి అని వాదించారు. అయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి లాయర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీబీఐ కోర్టు వారిని ఈ విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోమని సూచించింది..