ఐదుగురు అమ్మల ముద్దుబిడ్డ!

 

 

 

అమ్మ అనే మాటే ఒక అద్భుతం. అమ్మ మనిషికి దేవుడిచ్చిన వరం! అలాంటి వరం అందరికీ ఒక్కటే వుంటుంది! అలాంటి వరాలు ఒకే మనిషికి ఐదు వుంటే ఆ మనిషి నిజంగా ఎంత అదృష్టవంతుడో కదూ! అలాంటి అదృష్టం పట్టిన వ్యక్తి ఎక్కడో లేడు.. మన రాష్ట్రంలోనే వున్నాడు. ఎప్పుడో లేడు.. ఇప్పుడే వున్నాడు.. మనమధ్యనే తిరుగుతున్నాడు. ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి.

 

అదేంటీ.. విజయమ్మే కదా జగన్ బాబుకి అమ్మ అని అనుకుంటున్నారా? కరెక్టే.. విజయమ్మ జగన్ బాబుకి మానవ జన్మనిచ్చిన అమ్మ!  ఇక తనకు రాజకీయంగా ముఖ్యమంత్రి జన్మని ఇవ్వడానికి జగన్ మరో నలుగురు అమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ నలుగురు అమ్మల్లో మొదటి అమ్మ మరెవరో కాదు... సోనియాగాంధీ! సోనియమ్మతో చేసుకున్న ఒప్పందం కారణంగానే జగన్ బాబు పదహారు నెలల జైలువాసం నుంచి బయటపడ్డాడు. ఆ అమ్మ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి సహకారం అందిస్తున్నాడు. ఒకవేళ భవిష్యత్తులో సోనియమ్మ తనమీద రివర్సయితే తనకు అండగా నిలవటానికి మరో ముగ్గురు అమ్మల అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.



ఆ ముగ్గరమ్మలు మరెవరో కాదు.. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి! మీరు నాకు అండగా నిలిస్తే, వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మీరు ఎవరికి మద్దతు ఇవ్వమంటే వాళ్ళకే మద్దతిస్తా, మీరు చెప్పినట్టే వింటానంటూ జగన్ ఈ ముగ్గురమ్మలకీ విడివిడిగా వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశిస్తున్న ఈ ముగ్గురమ్మలూ జగన్‌ని పుత్రవాత్సల్యంతో చూస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్లో కేంద్రంలో ఈ ముగ్గరిలో ఎవరు బలమైన శక్తిగా ఎదిగితే, ఆ శక్తి కొంగుచాటు కృష్ణుడిలా మారడం కోసం జగన్ పథక రచన చేసినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



నలుగురు పొలిటికల్ మదర్స్ నుంచి జగన్ రాజకీయ లబ్ధి పొందుతాడా.. లేక నలుగురు అమ్మలూ జగన్‌ చెవి మెలేసి, ఈ కొంగుచాటు కృష్ణుడిని తన జన్మస్థానానికి పంపిస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాలి.